‘సర్’ కొనసాగాల్సిందే..
` ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దు
` సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ(జనంసాక్షి):బెంగాల్‌లో నిర్వహిస్తోన్న ‘సర్’ కసరత్తును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే తాము కల్పించుకుంటామని పేర్కొంది. అంతేకానీ సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్టాలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్) కోసం 300మంది అధికారులను కేటాయించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరితే..80 మంది గ్రేడ్`2 స్థాయి అధికారులనే కేటాయించిందని న్యాయస్థానానికి ఈసీ తెలియజేసింది.మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్టాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాల్లో చేర్చడం లేదని బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. ఇంటి పేర్లలో అక్షరదోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న లోపాలను సాకుగా చూపి.. ఓట్లు తొలగిస్తున్నారని ధర్మాసనానికి తెలిపింది. దీనివల్ల 1.36 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. తమ స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని బెంగాల్ సర్కార్ న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును ఒక వారం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.



