పీఠం ఎక్కేది ఎవరో తేలేది నేడే..

` కరీంనగర్‌లో మారిన సీన్
` కాంగ్రెస్ గూటికి ఐదుగురు ఇండిపెండెంట్‌లు
సర్వత్రా ఉత్కంఠ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో నాటకీయ మలుపులు
హైదరాబాద్/కరీంనగర్(జనంసాక్షి): కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. ప్రధాన పార్టీల వ్యూహాలతో రసవత్తరంగా మారుతోంది. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సాయిజ్యోతి, శ్యామల, స్వతంత్ర కార్పొరేటర్లు కొమరయ్య, నందిని ఉదయ్, మల్లేశం సైతం హస్తం గూటికి చేరారు. ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మాజీద్ హుస్సేన్ కూడా మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ.. కరీంనగర్ అభివద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. అభివద్ధి కాంక్షించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని మొత్తం 66 డివిజన్లలో 30 సాధించి భాజపా పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 14, భారాసకు 9, ఎంఐఎంకు మూడు దక్కగా 10 మంది స్వతంత్రులున్నారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి.