ప్రజాతీర్పును గౌరవించడం నేర్చుకోండి
` ప్రజలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకంలేని విపక్షాలు
` మాకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు
` పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు ` సేవకుడిగా మాత్రమే ప్రవర్తిస్తున్నా
` లంబాడీలు నాకు అండగా నిలిచారు
` సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు.వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచన తనదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీలు 17 శాతం ఉంటే తమ ప్రభుత్వంలో 30 శాతం ఉన్నారన్నారు. దళితులకు 3 మంత్రి పదవులు, స్పీకర్ ఇచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారికి మేలు చేశామన్నారు. సంత్‌సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్? పుణ్యక్షేత్రాన్ని అభివద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని హావిÖ ఇచ్చారు.తెలంగాణ ఉద్యమంలో లంబాడీల పాత్ర మరిచిపోలేనిదన్న సీఎం రేవంత్,? వారికి సముచిత స్థానం కల్పించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తాను గతంలో జడ్పీటీసీగా గెలిచేందుకు సహకరించింది నాగర్?కర్నూల్? జిల్లా మిడ్జిల్‌లోని లంబాడీ యువకులేనని తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలోని ప్రతి సందర్భంలో లంబాడీలు తనకు అండగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.రాష్టంలోని అన్ని తండాల్లో రహదారులు మంచిగా ఉండాలనే ఆలోచనతోనే బీటీ రోడ్లు వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి తండాలో పాఠశాల భవనాలు ఏర్పాట్లు చేయాలన్నారు. సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంటు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల అభివద్ధి కోసం ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో సన్నబియం ధర రూ.45కు తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. 51 లక్షల పేద కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వ వసతి గహాల్లోని 40 శాతం మెస్ ఛార్జీలు, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.ప్రభుత్వం వద్ద ప్రస్తుతం భూములు లేవని, కానీ ప్రజలకు సంక్షేమంతో పాటు విద్య ఇవ్వాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు. చదువు వల్ల కీలక పదవులు వస్తాయన్న ఆయన, చదువుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాలురకు 100, బాలికలకు 200 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను చేయించిన సర్వేలో ఆస్తుల వల్ల కాదు, చదువు లేకపోవడం వల్ల పేదరికం వచ్చినట్లు తేలిందన్నారు. వెనుకబాటు తనం అన్నది ఒక శిక్ష అని, చదువు ఒక్కటే సమాజంలో ఒక హోదాలో నిలబెడుతుందని స్ఫూర్తి నింపారు. పేద పిల్లలకు చదువు అందించడానికి ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్ష నేతలు ప్రజలను నిందిస్తున్నారని మండిపడ్డారు.



