విద్యార్థి నేతలపై ఉక్కుపాదం

 

 

 

 

 

 

పిబ్రవరి 16( జనం సాక్షి)ఉస్మానియా యూనివర్సిటీ,  ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా పాలనలో విద్యార్థి నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల సెంటెనరీ లేడీస్‌ హాస్టల్‌ సమస్యపై రాత్రంతా రోడ్డుపై ఆందోళన చేసిన విద్యార్థినులకు అండగా నిలిచిన విద్యార్థి నేతలపై పోలీసు లు కేసులు నమోదు చేశారు. ప్రజా పాలనలో క్యాంపస్‌లో పోలీసు రాజ్యం నడుస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్న వేళ.. దీనికి వంతపాడేలా ఓయూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో)ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే విద్యార్థి నాయకులను పరోక్షంగా భయపెట్టి ఎలాంటి ఆందోళన లు జరపకూడదని అనధికారికంగా హెచ్చరించినట్లు పుకార్లు శికారు చేస్తున్నాయి. తాజా ఘటనలో మొత్తం పది మంది విద్యార్థి నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవల రాత్రంతా రోడ్డుపైనే..
చరిత్రలో మునుపెన్నడూలేని రీతిలో లేడీస్‌ హాస్టల్‌ విద్యార్థినులు తమ సమస్యల పరిష్కారం కోసం గత మంగళవారం రాత్రంతా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఓయూ అధికారులు విద్యార్థినులతో చర్చించి, సమస్య తెలుసుకుంటే విద్యార్థినులు ఆందోళన విరమించే అవకాశం ఉండేది. కానీ రాత్రంతా ఆడపిల్లలు ఆందోళన చేస్తుంటే కేవలం వారితో చర్చించేందుకు స్టూడెంట్‌ ఎఫైర్స్‌ డీన్‌ను పంపించి, ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. రాత్రి పదిన్నర గంటలకు అక్కడికి చేరుకున్న ఆయన అరగంట ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఉదయం వరకు అక్కడే చలి, దోమలను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే ఉండిపోయారు.

వారికి మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అండగా నిలిచారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఏసీపీ గ్యార జగన్‌ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఓవరాక్షన్‌ చేశారని విద్యార్థులు మండిపడ్డారు. ఏసీపీయే నేరుగా రంగంలోకి దిగి తన అధికార పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరిస్తూ, విద్యార్థి నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు ఉదయం పదిగంటలకు సీఎస్‌ఓ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆఘమేఘాలమీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌పై విస్మయం
ఓయూ సీఎస్‌వో చేసిన ఫిర్యాదు, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోం ది. ఒకవైపు ఆందోళన చేసిన వారిని వదిలేసి, కేవ లం వారికి అండగా నిలిచినవారిపైనే సీఎస్‌వో ఫిర్యాదు చేయడం, దానికి అనుగుణంగానే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం.. ఎవరి ఆదేశాలకు అనుగుణంగా చేశారో అర్థం అవుతోందని విద్యార్థులు మండిపడుతున్నారు. అసలు ఆందోళనబాట పట్టిన విద్యార్థినుల గురించి ప్రస్తావించకుండా కేవలం వారికి మద్దతుగా నిలబడినందుకే తమపై కేసులు నమోదు చేశారని దుయ్యబడుతున్నారు. మొత్తం పది మంది పేర్లు ప్రస్తావించి, చివరి పేరుతో పాటు ఇతర విద్యార్థినులు అని మాత్రమే పేర్కొన్నారని విమర్శిస్తున్నారు. సదరు ఫిర్యాదుదారుతోపాటు కేసు నమోదు చేసిన అధికారులు ఎవరిమెప్పు కోసమే తాపత్రయపడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసు నుంచి తప్పించాలంటే..
కేసు నమోదైన విద్యార్థి నాయకులను పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన దగ్గరకు పిలిపించుకుని హితోక్తులు చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల స మాచారం. ఫోన్‌లు బయట పెట్టించి, క్యాబిన్‌కు రాగానే మూడు నెలలు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటామని లిఖిత పూర్వక హామీ (అండర్‌టేకింగ్‌)ఇస్తే కేసు నుంచి తప్పిస్తానని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అంటే యూనివర్సిటీలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు శతవిధాలా ఎందుకు ప్రయత్ని స్తున్నారని విద్యార్థి నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు పోలీసులు ఉన్నతాధికారులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారా లేక వర్సిటీ ఉన్నతాధికారుల కోసం పనిచేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు.

గతంలోనూ పలు వివాదాలు..
పోలీసుల వ్యవహార శైలిపై ఓయూలో ఇప్పటికే పలు వివాదాలు నెలకొన్నాయి. గతంలో నిరుద్యోగుల ఉద్యమం సమయంలో ల్యాండ్‌స్కేప్‌లోకి ప్రవేశించి ఇష్టానుసారంగా వ్యవహరించిన అంశంలో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కార్యక్రమానికి కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులమని చెబుతున్న వినకుండా అదుపులోకి తీసుకోవడంతో పాత్రికేయులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. నాన్‌బోర్డర్లు ఉండకూడదని, క్యాంపస్‌ను క్లోజ్‌డ్‌ క్యాంపస్‌గా మార్చాలని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పడం మరింత వివాదాస్పదమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన యూని వర్సిటీకి సంబంధించిన అంశాలను అధికారులు మాట్లాడి, ఏ నిర్ణయాన్నైనా వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదంతో జరగాలని, కానీ పోలీసుల జోక్యం ఏందని విద్యావేత్తలు, మేధావులు పెదవి విరిచారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ప్రజాపాలన, మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభు త్వం ఓయూలో నిర్బంధం అమలు చేస్తోందని మండిపడుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ సైతం కరుకు ఖాకీల పదఘటనల మధ్య పడి నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ, వి ద్యారంగ సమస్యలపై కచ్చితంగా ఎప్పుడూ పోరా టం చేస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఓయూ ఎప్పుడూ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే గుణం ఈ ఓయూ గడ్డకు ఉందని అన్నారు. నిర్బంధాలు, అక్రమ కేసులతో ఉద్యమాలను నిలువరించలేరని హెచ్చరిస్తున్నారు.