స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

` సభలో తమను మాట్లాడనివ్వడం లేదని విపక్షాల ఆరోపణ
న్యూఢిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ కథనం వెల్లడించింది. అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు ఇప్పటికే విపక్షాలు నోటీసులిచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. తమ చర్య కోసం వేచిచూడాలని పేర్కొంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రసంగించేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీని స్పీకర్ (Oఎ ఃతితీశ్రీజీ) అనుమతించలేదని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఇక, కాంగ్రెస్ ఎంపీలు, మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడిన భాజపా ఎంపీ నిషికాంత్ దూబేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.ఈ తీర్మానం తీసుకురావాలంటే కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేతత్వంలో జరిగిన ఈ భేటీలో టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీలు పాల్గొన్నట్లు తెలిపాయి.మరోవైపు, పార్లమెంట్‌లో సోమవారం కూడా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. విపక్షాల నిరసనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. అటు రాజ్యసభలో ఖర్గే ప్రసంగానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.