సాయుధ తెలంగాణ యోధుడు నర్రా రాఘవరెడ్డి ఇకలేరు

1

నల్లగొండ, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి):

తెలంగాణ సాయుధపోరాటయోధుడు, సీపీఎం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవరెడ్డి నార్కట్‌ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. నర్రా వయస్సు 92 సంవత్సరాలు. ఆయన నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ప్రజల్లో సాయుధ పోరాట కాలంలో సాంస్కృతిక బృందాలకు ప్రాతినిథ్యం వహిస్తూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచారు. నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. నర్రా స్వంత ఊరు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి. నిస్వార్థం, నిరాండంబరత, నిజాయితీ, సేవాతత్పరతకు మూర్తీభవించిన వ్యక్తి. దీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి అహరహరం శ్రమించారు.

నర్రా రాఘవరెడ్డి కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ దశలో గురువారం సాయంత్రం కామినేని ఆస్పత్రికి రాఘవరెడ్డిని తరలించారు. చివరకు అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించిన నేత నర్రా రాఘవరెడ్డి. కమ్యూనిస్టుల కంచుకోట నకిరేకల్‌లో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్నా… నిష్కలంక నేతగానే రాఘవరెడ్డి పేరుగాంచారు.  అసెంబ్లీలో ఆయన వాణి గట్టిగా వినిపించేవారు. అధికారంలో ఎవరున్నా ఆయన ప్రజల వాణి వినిపించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నిరంతర పోరాటమే జీవనంగా సాగారు.  నర్రా రాఘవరెడ్డి  మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడులు సంతాపం తెలిపారు. సీపీఎం

పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి.మధు సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటన్నారు. కమ్యూనిస్ట్‌ నేతల్లో అత్యంత నిరాడంబరంగా జీవితాంతం నిలబడిన వ్యక్తి రాఘవరెడ్డి.