రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు

` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ
` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య
న్యూఢిల్లీ(జనంసాక్షి):రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పలు వివాదాల నడుమ ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదన్నారు. నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని అన్నారు. సమాజంలో విద్వేషాలు పెంచడానికి, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలను, విÖడియాను ఆయుధంలా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.ఇలాంటి విషయాలను బహిరంగంగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారని.. మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. తాను కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని తెలిపారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భాజపా ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తప్పుబట్టారు. ఇంట్లో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడడం సరైన చర్య కాదని అన్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాక, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తర్వాత అది నిజమో కాదో ప్రజలే తెలుసుకుంటారని తెలిపారు. 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ2’ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు.