మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు
రేపు, ఎల్లుండి పర్యటించనున్నమంత్రి
మంథని, (జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన సోమవారం అనివార్య కారణాల వలన రద్దయింది. హైదరాబాదులో మంత్రి శ్రీధర్ బాబుకు అత్యవసర మీటింగ్ ఉన్నందున మంగళవారం, బుధవారంలో మంత్రి పర్యటిస్తారని మంత్రి వ్యక్తిగత సహాయకులు ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నూతన మంథని మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సమావేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంథని మున్సిపాలిటీ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా గాంధీ చౌక్ లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. బుధవారం పెద్దపల్లి రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99) రోజుల యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మంథని మండలంలో 20 లక్షలతో నిర్మించిన గుమ్మునూరు గ్రామపంచాయతీ ప్రారంభోత్సవంతో పాటు 3 కోట్ల 75 లక్షలతో గుమ్మునూరు నుండి దంతలపల్లి మీదుగా కాకర్ల పల్లి వరకు బిటి రోడ్ శంకుస్థాపన చేయనున్నారు. మంథని మున్సిపాలిటీ మజీద్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులకు నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే విధంగా రామగిరి మండలంలోని సెంటనరీ కాలనీ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొని అక్కడ టీసీఎస్ వారి ద్వారా 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ… వారికి ఉద్యోగ పత్రాలని ఇవ్వనున్నారు. ఆడిటోరియం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభోత్సవం చేయనున్నారు.



