అందరిచూపు.. ‘విజేందర్‌’పైనే!

లండన్‌, ఆగస్టు 4: ప్రస్తుతం అందరి చూపు ఆ ఒక్కడి వైపు.. ఆ ఒక్కడు రెండో ఒలింపిక్‌ పతకాన్ని సొంతం చేసుకోడానికి చేరువలో ఉన్నాడు.. సాధిస్తాడని.. ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అతడు కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎవరి దీవెనలు ఎలా ఉన్నా.. అతడు మాత్రం తన లక్ష్యంకేసి దూసుకుపోతున్నాడు. రెండో ఒలింపిక్‌ సాధించేందుకు కేవలం ఓ విజయం దూరంలో ఉన్నాడు. ఇంతకీ అతనెవరో తెలుసా.. భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌. క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్న ఇతగాడు సోమవారం జరగనున్న క్వార్ట్‌ర్స్‌లో అటోవ్‌ అబ్బాస్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో తలపడనున్నాడు. హర్యానా బాక్సర్‌ ఈ బౌట్‌లో గెలిస్తే పతకం ఖాయమైనట్టే! రెండో వ్యక్తిగత ఒలింపిక్‌ పతకం.. వరుసగా రెండోసారి గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రలో నిలిచిపోతాడు.. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌!
విజేందర్‌ పోరాట పటిమ ఇంతింతకాదయా..
విజేందర్‌ గెలిచిన తీరును ఒక గమనిస్తే.. అతగాడి పోరాట పటిమ ఏ పాటిదో తెలుస్తుంది. గురువారం రాత్రి జరిగిన పురుషుల మిడిల్‌ వెయిట్‌ (75 కిలోల) కేటగిరి ప్రీ క్వార్టర్స్‌లో విజేందర్‌ 16-15తో టెర్రెల్‌ గౌష (అమెరికా)పై పోరాడి గెలిచాడు. తొలి రౌండ్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. ఒక్క పాయింట్‌ లీడ్‌ను సాధించాడు. రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. ఒక్క పాయింట్‌ తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని విజేందర్‌ ప్రీ క్వార్టర్స్‌ విజయానంతరం ఉద్వేగంగా అన్న విషయం తెలిసిందే.
విజయ’హాసం’
ఒలింపిక్‌ విజయం అత్యుత్తమమైనది.. అనుకున్నది సాధించా.. ఒలింపిక్స్‌లో తొలిసారిగా పాల్గొన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించా.. మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని భారత షూటర్‌ విజయకుమార్‌ ఉద్వేగంగా అన్నారు. సైనా, గగన్‌పైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారు వెనుకపడడంతో ఒకింత నిరాశకు లోనయ్యారు. ఇంతలో నేనున్నానంటూ విజయకుమార్‌ రతజం సాధించి భారత్‌కు రెండో పతకాన్ని చేకూర్చినవాడయ్యాడు. తాజా ఈవెంట్‌లో భారత్‌కు రెండో పతకం. షూటింగ్‌లో మాత్రం నాల్గవది.
21 స్వర్ణాలతో మెరుస్తున్న అమెరికా!
తాజా ఒలింపిక్స్‌లో అమెరికా 21 స్వర్ణాలతో మెరిసిపోతోంది. నిన్నటి వరకు పైచేయిగా నిలిచిన చైనా ఒక పతకంతో వెనుకబడింది. చైనా 20 స్వర్ణాలను సాధించి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత దక్షిణ కొరియా 9 పతకాలతోను, బ్రిటన్‌ 8, ఫ్రాన్స్‌ 8, జర్మని 5, ఇటలీ 4, ఉత్తర కొరియా 4, కజకిస్తాన్‌ 4, రష్యా 3, దక్షిణాఫ్రికా 3, న్యూజిలాండ్‌ 3, జపాన్‌ 2, క్యూబా 2, నెదర్లాండ్స్‌ 2, హంగేరీ 2, ఉక్రెయిన్‌ 2, ఆస్ట్రేలియా 1, రుమేనియా 1 స్వర్ణాలతో వరుసగా నిలిచాయి. భారత్‌ మాత్రం శుక్రవారం నాటికి ఒక్క స్వర్ణాన్ని కూడా తన ఖాతాలో నమోదు చేసుకోలేదు. భారత్‌ ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్యం మాత్రమే సాధించింది.
సైనాపై ఆశలతో..
అందరి చూపు సైనాపైనే నిలిచింది. శనివారం నాటి ఆటలో కాంస్యం సాధించడం ఖాయమని అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. నేడు జరగనున్న పోరులో ఆమె వాంగ్‌ జిన్‌ (చైనా)తో కలిసి పోరాడనున్నది. బాడ్మింటన్‌ కాంస్యపతకం పోరు శనివారం సాయంత్రం 5.30గంటలకు ప్రారంభం కానున్నవిషయం తెలిసిందే.