భట్టి తీవ్ర మనస్తాపం

 

 

 

 

 

 

 

జనవరి 22 ( జనం సాక్షి ) :కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ సీనియర్‌ మంత్రులు, ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్‌ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ చానల్‌లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని, దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు విభేదం, అగాథం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్‌ను దెబ్బతీసి అవినీతి ముద్రవేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని పదేండ్లు కాంగ్రెస్‌ను బతికించిన తనను కావాలని బద్నాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని భట్టి మథనపడుతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం.

పార్టీలోని సీనియర్‌ మంత్రులు పలువురు భట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతుకోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరుప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్‌ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయ పడ్డట్టు సమాచారం.

ఇదే విషయంపై వారు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని, తొందరపడవద్దని అధిష్ఠానం పెద్దలు సీనియర్లను సముదాయించినట్టు తెలిసింది.

ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా? దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా భట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్‌ ముఖమ్మీదే తన ఆవేదనను వెల్లగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? ‘అసలు కాంగ్రెస్‌’కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? అందుకే మేడారం పర్యటన ఆలస్యమైందా?.. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అంతేకాదు సీఎం తీరును నిరసిస్తూ మేడారంలో భట్టితోపాటు పలువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించుకున్నారని, హైదరాబాద్‌కు వచ్చాక మరోసారి భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఎంతవరకైనా పోరాడాల్సిందే’ అని వారు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నలుగురు సీనియర్‌ మంత్రులు కలిసి ఈ పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. తాము అన్నీ గమనిస్తున్నామని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఢిల్లీ పెద్దలు సూచించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.