దిగుబడేకాదు.. కొనుగోళ్లలోనూ రికార్డు
` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం
` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం
` బోనస్‌తో కలిపి చెల్లించిన మద్దతు ధర మొత్తం 18,532.98 కోట్ల చెల్లింపు
` అగ్రస్థానంలో నిజమాబాద్,నల్లగొండ జిల్లాలు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ధాన్యం దిగుబడిలోనే కాకుండా ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చెందిన ధాన్యం దేశచరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని ఆయన చెప్పారు. 2025`26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకై పౌర సరఫరా శాఖా రూపొందించిన ప్రణాలికలపై గురువారం రోజున బేగంపేట ఐ.ఏ.ఎస్.ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో జరిగిన సవిÖక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవదిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని ఆయన చెప్పారు. పౌరసరఫరాల శాఖా,నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం సాధించామని ఆయన చెప్పారు. స్వాతంత్యం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణా రాష్టాన్రికి దక్కిందన్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్టాల్రలో లేవని ఆయన తెలిపారు. 2020`21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డ్ ను అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సష్టించిందన్నారు. మద్దతు ధర తో పాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు. ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా రూపొందించిన మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 8,548 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు కొనుగోలు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు పక్రియ ముగిసిందని ఆయన వివరించారు. అందుకు పౌర సరఫరాల శాఖ సిబ్బంది పని తీరును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అధిక దిగుబడులతో పాటు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చెసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ కు సరఫరా చేయడంతో పాటు తెలంగాణా బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ను పట్టి విదేశాలకు ఎగుమతి చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని పండించేందుకు గాను రైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాల ఆవశ్యకతను ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ కు బియ్యాన్ని ఎగుమతి చెసేందుకు కుడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు పక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 38,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం కుడా ఒక అరుదైన రికార్డే అని ఆయన చెప్ప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో సంచలనాత్మక ఫలితాలు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.అర్హులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సన్నబియ్యం 3.17 కోట్ల మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని,అంటే రాష్ట్ర జనాభాలో 85? లబ్ది పొందుతున్నారని ఆయన వివరించారు.అర్హులైన ప్రతి లబ్దిదారుకు నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీ విÖద 13,650 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఉన్న నాణ్యతా లోపాలు గుర్తించడంతో పాటు అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలి పోయే విధానానికి క్లళెం వేసి నాణ్యతా ప్రమాణాలపై కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చామన్నారు. ధాన్యం కొనుగోళ్ల పక్రియ సీజన్ కు సీజన్ కు పెరుగుతున్న నేపద్యంలో అందుకు అనుగుణంగా నిల్వ చేసేందుకు మౌలిక సదుపాయాల ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ధాన్యాన్ని నిల్వచేసే గోదాముల సామర్ధ్యం 29 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పరిమితము అయ్యిందని,ఈ గోదాములను భారత ఆహార సంస్థ,రాష్ట్ర గోదాముల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతుందని అయితే నాణ్యతా లోపాలతో నిల్వ ఉంచిన బియ్యం చేడి పోయి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు.ప్రభుత్వం సహకారంతో పాటు ప్రవైట్ సంస్థల భాగస్వామ్యం తో ధాన్యం నిలువ ఉంచే గోదాములను సైలో పద్దతిలో ఆధునికరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు.. ఆధునికీకరణతో తేమ శాతం నియంత్రణలో ఉండడంతో పాటు నష్టానివారణ చర్యలు చేపట్టవచ్చన్నారు. అయితే ప్రారంభంలో ఆధునీకరణకు ఖర్చు ఎక్కువే అయినప్పటికీ నిల్వ చేసిన బియ్యం చెడిపోకుండా ఉంటే అది ప్రయోజనం కలిగిస్తుందన్నారు. బీహార్ వంటి రాష్టాల్ర నుండి వలస వచ్చే కార్మికులపై తెలంగాణా రాష్ట్రంలో రైస్ మిల్లులు ఆధారపడుతున్నాయని,ఇటీవల ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వలస వచ్చిన కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో కొనుగోళ్ల పక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గాను స్థిరమైన కార్మిక వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకతను ఆయన సూచించారు. అదే విదంగా మిల్లింగ్ రంగం గురుంచి ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని తప్పిదాలకు పాల్పడితే మాత్రం చర్యలు కఠినాత్మకంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిబంధనల అమలులో సిబ్బంది కఠినంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. అదే సమయంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని ,పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమని ప్రోత్సహించె విదంగా విధివిదానలను త్వరలో ప్రకటించ నున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మరిన్ని నిత్యావసర సరుకుల సరఫరాకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డైయర్లు ,పాడి క్లినర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని,అన్ని వేళల ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


