కేటీఆర్‌కు సిట్ నోటీసులు
` ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
` నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీ 160 కింద నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులను సిట్ అధికారులు అందజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్ప్పుడు నాయకుల విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. ఆయన్ను కూడా ఇటీవల విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను పలు అంశాలపై విచారించిన అధికారులు.. కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ’నిన్న నాకు నోటీసులు ఇచ్చారు. ఇప్ప్పుడు కేటీఆర్‌కు ఇచ్చారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేదు. రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా.. 6 గ్యారంటీలు, 420 హావిÖలు అమలు చేసేదాకా వదలబోము. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా.. రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన వెంటపడుతూనే ఉంటాం’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
సిట్‌ను నేనూ ప్రశ్నిస్తా?
` నా ఫోన్ ట్యాప్ అవుతుందా? అని ప్రశ్నిస్తా
` మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ప్రమాణం చేసి చెబుతారా?: కేటీఆర్
సిరిసిల్ల(జనంసాక్షి): కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన విÖడియాతో మాట్లాడారు. “సీఎం బావమరిది బొగ్గు స్కామ్‌ను హరీశ్‌రావు బయటపెట్టారు. ఉదయం కుంభకోణం బయటపెడితే సాయంత్రానికి నోటీసులు వచ్చాయి. రేవంత్‌రెడ్డి సిట్ అంటే… సిట్, స్టాండ్. సిట్ విచారణ సీరియల్ లా మారింది. ఆరఆర్ ట్యాక్స్, బొగ్గు కుంభకోణంపై మాత్రం సిట్ ఉండదు. ఏదో రూపంలో ప్రజల దష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాదు.. అసమర్థ పాలన. మేము ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడేది లేదు. కేవలం రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సిట్ విచారణకు కచ్చితంగా హాజరవుతా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధంలేని నేతలను ప్రశ్నించారు. సిట్ అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా. నా ఫోన్ ట్యాప్ అవుతుందా? అని సిట్ అధికారులను అడుగుతా. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయవు.. పోలీసు వ్యవస్థ చేస్తుంది. శివధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వంటి అధికారులను ప్రశ్నించట్లేదు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ప్రమాణం చేసి చెబుతారా? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెబితే ఖండించలేదు” అని కేటీఆర్ అన్నారు.
నోటీసులకు భయపడం
` హామీలు అమలు చేసే వరకు వెంటపడుతూనే ఉంటాం:హరీశ్‌రావు
మెదక్(జనంసాక్షి): బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పలేక .. నిన్న నాకు, ఇవాళ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఆరు గ్యారెంటీలు, 420 హావిÖలు అమలు చేసే వరకు వెంట పడుతూనే ఉంటామన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా సీఎం ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.“పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవి. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్టాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్, అమెరికా పర్యటన పెట్టుకున్నారు. సర్కారు డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పినా.. కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్ నడిపిస్తోంది. రేవంత్‌రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుంచి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదం” అని నిరంజన్‌రెడ్డి అన్నారు.
రెండేళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు నోటీసులా?: సోమ భరత్
రెండేళ్ల క్రితం నమోదైన కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆరఎస్ నేత సోమ భరత్ విమర్శించారు. “నోటీసు ఇచ్చి .. విచారణకు వచ్చేందుకు కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వలేదు. రెండ్రోజుల క్రితం మరో సీనియర్‌నేత హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారు. కేవలం ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు ఇస్తున్నారు. సిట్ ఎందుకు వేశారో కూడా తెలియదు. ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అక్రమాలను బయటపెడుతుంటే నోటీసులు ఇస్తున్నారు. విచారణకు కేటీఆర్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరాం. సాక్షిగా విచారణ చేసినప్పుడు న్యాయవాదిని అనుమతించబోమని ఏసీపీ చెప్పారు” అని భరత్ తెలిపారు.


