అందరి చూపు.. సెమెన్యాపైనే..

తొలి రెండుస్థానాల్లోకి ఎగబాకేందుకు
సర్వశక్తులు ఒడ్డుతున్న బ్రిటన్‌ అథ్లెట్లు
లండన్‌, ఆగస్టు 8 : అందరి చూపు ఆమె పైనే.. గతం మరిచి.. మెరుగులు దిద్దుకుంది..
తాజా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరగనున్న 800 మీటర్ల రేసులో పాల్గొనబోతోంది 21 ఏళ్ల క్యాస్టర్‌ సెమెన్యా (దక్షిణాఫ్రికా). ఆమె లింగ నిర్ధారణ పరీక్ష ఎదుర్కోవడం.. ఏడాదిపాటు నిషేధానికి గురి కావడం క్రీడాభిమానులకు తెలిసిన విషయమే. తాను జరిగిన దాని గురించి ఆలోచించకుండా లండన్‌ మెగా ఈవెంట్‌పైనే దృష్టి నిలిపినట్టు ఆత్మవిశ్వాసంతో వెల్లడించింది. రన్నింగ్‌పైనే దృష్టి పెడతాను. అత్యుత్తమ పరిగెత్తేందుకే ప్రయత్నిస్తాను. తన కెరీర్‌లో తొలి ఒలింపిక్‌ కాబట్టి చాలా ప్రత్యేకంగా ఉంది అని సెమెన్యా పేర్కొంది. ఇదిలా ఉండగా ఆమె గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. 800 మీటర్ల డిఫెండింగ్‌ చాంపియన్‌ పమేలా జెలిమో (కెన్యా)తో తలపడనుంది. గురువారం సెమీస్‌, ఆదివారం ఫైనల్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా క్యాస్టర్‌ సెమెన్యాకు బెస్టాఫ్‌లక్‌!
ప్రపంచ పరుగుల వీరుడు బోల్ట్‌ మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం నాటి రేస్‌లో 200 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సంపాదించాడు. తొలి హీట్స్‌ను బోల్ట్‌ 20.39 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా తన కెరీర్‌లో 30సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఇసిన్‌బయేవా తాజా ఒలింపిక్స్‌లో 4.70 మీటర్ల ఎత్తు ఎగిరి మూడో స్థానంలో నిలిచింది. కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆమెతో తలపడిన జెన్నిఫర్‌ సుర్‌ (అమెరికా), యారిస్లె సిల్వా (క్యూబా) ఇద్దరు 4.75 మీటర్ల ఎత్తు ఎగిరి సమఉజ్జీగా నిలిచారు. ఏడో ప్రయత్నంలో ఈ ఎత్తును అధిగమించడంతో జెన్నిఫర్‌ను స్వర్ణం వరించింది. ఎనిమిదో ప్రయత్నంలో సిల్వా ఆధిక్యత సాధించి రజత పతకాన్ని చేజిక్కించుకుంది.
పతకాల పట్టికలో చైనా అథ్లెట్లు తమ హవా కొనసాగిస్తున్నారు. మంగళవారంనాడు కూడా తమ సత్తా చాటుకున్నారు. మొత్తం 71 పతకాలు సాధించి అగ్రభాగాన నిలిచారు. ఆ తర్వాతి స్థానాన్ని అమెరికా కైవసం చేసుకుంది. తాజా ఒలింపిక్స్‌లో ఆయా దేశాల అథ్లెట్లు సాధించిన పతకాలను మరోసారి పరిశీలిద్దాం. చైనా 34 స్వర్ణాలు, 20 రజతాలు, 17 కాంస్యాలు.. మొత్తం 71 పతకాలతో అగ్రభాగాన నిలిచింది. ఆమెరికా 30స్వర్ణాలు, 16రజతాలు, 20కాంస్యాలతో మొత్తం 66పతకాలు సాధించి రెండో స్థానంలో కుదురుకుంది. పై రెండింటితో సమానమవ్వాలన్న బ్రిటన్‌ అథ్లెట్ల ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. బ్రిటన్‌ 22 స్వర్ణాలు, 13 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం 47 పతకాలు సాధించి అగ్రభాగాన నిలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. అత్యధిక స్వర్ణాలు సాధించి రెండో స్థానంలో నిలిచేందుకు బ్రిటన్‌ అథ్లెట్లు కేవలం 8 పతకాల దూరంలో ఉన్నారు. వారు లక్ష్యానికి చేరుకోగలరా.. లేదా.. అన్నది తేలాలంటే మరో మూడు రోజుల పాటు వేచి చూడాల్సిందే.
నేటి భారతీయం..
ఒలింపిక్స్‌లో బుధవారంనాడు పోరాడనున్న భారత అథ్లెట్లు.. మహిళల 800 మీటర్ల రౌండ్‌-1లో టింటూ లుకా (ఈమె పీటీ ఉష శిష్యురాలు), బాక్సింగ్‌లో మేరీకామ్‌ వర్సెస్‌ నికోల ఆడమ్స్‌ (బ్రిటన్‌), దేవేంద్రో సింగ్‌ వర్సెస్‌ ప్యాడీ బార్నెస్‌ (ఐర్లాండ్‌).