కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్

 

 

 

 

 

ఫిబ్రవరి10 (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 11.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, మొత్తం మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకుగాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్‌ జరుగుతున్నది. మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం 6,017 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

బ్యాలెట్‌లో మారిన సీరియల్ నంబర్లు.. ఆందోళనలో అభ్యర్థులు

మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్‌లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు మారడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార యంత్రాంగం ఇచ్చిన బ్యాలెట్ నమూనా ఒకలా ఉంటే.. పోలింగ్ రోజు మరోలా ఇస్తున్నారని వాపోతున్నారు.

ముందుగా ఇచ్చిన నమూనా బ్యాలెట్‌లో ముందు ప్రధాన పార్టీల గుర్తులు.. ఆ తర్వాత జనసేన, ఇతర పార్టీల గుర్తులను ఇచ్చారు. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజు ఇచ్చిన బ్యాలెట్‌లో జనసేన పార్టీకి ఒకటో నంబర్ ఇచ్చారు. దీంతో ప్రధాన పార్టీల గుర్తులన్నీ మారిపోయాయి. ఎన్నికలు ప్రారంభమయ్యాక ఇది గమనించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ యంత్రాంగం పట్టించుకోలేదు. పై నుంచి అలాగే వచ్చిందని.. తామేమీ చేయలేమంటూ ఎన్నికల అధికారులు చేతులెత్తేశారు. సీరియల్ నంబర్లు మార్చి అలాగే పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు.