అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులు

శ్రీకాకుళం, జూలై 27 : పప్పుదినుసుల అక్రమ వ్యాపారంపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝులిపించారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా మినుములను పెద్ద ఎత్తున తరలిస్తున్నారన్న సమాచారంతో నిఘా విభాగం డిఎస్పీ, సిఐ తదితరులు గ్రామంలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా లారీలు తరలిస్తున్న 78.10 క్వింటాళ్ల మినుములను పట్టుకున్నారు.సంతకవిటి మండల పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించిన మినుములను కొందరు వ్యాపారులు అక్రమంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ నిఘా విభాగం అధికారులకు కొందరు ఇటీవల సమాచారం ఇచ్చారు. ఆ మేరకు నిఘా విభాగం డిఎస్పీ కె.భార్గవరావు నాయుడు, సిఐ కె.పి.నాయుడు తదితరులు సిబ్బందితో గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన మినుములను లారీలో ఎక్కించి వేరే ప్రాంతాలకు రవాణా చేయబోతుండగా పట్టుకున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. స్వాధినం చేసుకున్న మినుములను స్థానికంగా ఉన్న సంతకవిటి సిఎస్‌డిటి డి.జనార్దనరావుకి, విఆర్వో జానకిరామయ్యకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు.