నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్
` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ
` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ
` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు అవగాహన
` శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపైనా శిక్షణ
హైదరాబాద్(జనంసాక్షి): నగర వ్యాప్తంగా బుధవారం ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగరమంతా సైనర్ల మోత మోగనుంది.సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు చోట్ల (సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీలో) మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్‌ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.ఈ మాక్ డ్రిల్‌లో 12 సివిల్‌డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి. సాయంత్రం 4 గంటలకు నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నగరమంతా సైరన్లు మోగించనున్నారు. అన్ని కూడళ్లలో రెండు నిమిషాల పాటు సైరన్‌లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రికల్ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు ఆపాలని అధికారులు సూచించారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగగా… పాకిస్తాన్ విషయంలో భారత సర్కార్ పలు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే అదే సమయంలో దేశంలో పౌరులపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమర్థవంతమైన పౌర రక్షణ కోసం భద్రత సన్నద్దతకు సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అనేక రాష్ట్రాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది.సమర్థవంతమైన పౌర సంసిద్ధతను నిర్ధారించే లక్ష్యంతో ఈ మాక్ డ్రిల్స్ ఢల్లీి, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. మాక్ డ్రిల్ సమయంలో తీసుకోవలసిన చర్యలలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లను అమలు చేయడం, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌర రక్షణ అంశాలపై పౌరులకు శిక్షణ ఇవ్వడం వంటివి ఉన్నాయని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులకు పంపిన సమాచారంలో కేంద్ర హోం శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢల్లీి, ముంబై, ఉరన్, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్ భటా, చెన్నై, కల్పక్కం, నరోరా… మొత్తంగా 13 జిల్లాలు కేటగిరీ-1 కిందకు వస్తాయి. ఇక కేటగిరీ-2 జాబితాలో201 జిల్లాలు ఉన్నాయి. మూడో కేటగిరీలో 45 జిల్లాలున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి. వీటిని కేటగిరీ-2 జాబితాలో చేర్చారు.ఇక, ఈ మాక్ డ్రిల్స్‌ను విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, ఇతర జనసమర్థ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువుల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. భారత వైమానిక దళంతో హాట్‌లైన్, రేడియో-కమ్యూనికేషన్ లింక్‌లను అమలు చేయడం… కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌ల కార్యాచరణను పరీక్షించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని ఓఆర్‌ఆర్ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మొత్తం 12 పౌర రక్షణ సేవలు ఈ డ్రిల్‌ను చేపడతాయి. సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఆ జాబితాలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ ఉన్నాయి.