కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 121వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర, విద్యా రంగాలకు, ముఖ్యంగా భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కస్తూరి రంగన్ చేసిన విశేష కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నాయకత్వంలో ఇస్రోకు నూతన గుర్తింపు లభించిందని, ఆయన మార్గదర్శకత్వంలో పురోగమించిన అంతరిక్ష కార్యక్రమం దేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టిందని కొనియాడారు. ప్రస్తుతం భారత్ ఉపయోగిస్తున్న అనేక ఉపగ్రహాలు కస్తూరి రంగన్ పర్యవేక్షణలోనే ప్రయోగించిన విషయం గుర్తు చేసుకున్నారు.నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పనలో డాక్టర్ కస్తూరి రంగన్ కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా, భవిష్యత్ దృక్పథంతో కూడిన విద్యా వ్యవస్థ ఆవిష్కరణకు ఆయన ఎంతో దోహదపడ్డారని పేర్కొన్నారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ఆవిష్కరణలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. దేశ నిర్మాణం కోసం కస్తూరి రంగన్ అందించిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని చెబుతూ ప్రధాని ఆయనకు వినమ్ర నివాళులర్పించారు.

తాజావార్తలు