ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు
` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు
` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు
` మాజీ మంత్రి సబితను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
` పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా
` ఇప్పుడు న్యాయం నన్ను నిర్దోషిగా నిలిపిందని హర్షం
హైదరాబాద్‌(జనంసాక్షి):ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్‌ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, గనులశాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే, దోషులకు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏళ్ల పాటు అతడికి జైలు శిక్ష పడిరది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్‌ రెడ్డితో సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం గాలి జనార్దన్‌ రెడ్డి కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ’కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పొలిటికల్‌ పార్టీని స్థాపించి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్‌ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరిపోయారు. అయితే.. సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డి ఇప్పటికే కొంత కాలం జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఓబులాపురం మైనింగ్‌ కేసులో విచారణ దాదాపు 13 ఏళ్లకు పైగానే సాగింది. 3,,400 డాక్యమెంట్లను పరిశీలించి, 219 మంది సాక్ష్యులను విచారించి.. కర్ణాటక ఫారెస్ట్‌ ల్యాండ్స్‌లో గాలి బ్రదర్స్‌ మైనింగ్‌ తవ్వకాల వల్ల 884.13 కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోయిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడిరచడం గమనార్హం. 2007 జూన్‌ 18న ఓఎంసీకి లీజులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగానే ’క్యాప్టివ్‌’ అనే పదాన్ని తొలగించారని, తద్వారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009లో డిసెంబర్‌ 7న తొలిసారి సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో స్టే రావడం, మళ్లీ డివిజన్‌ బెంచ్‌ స్టే ఎత్తివేయడం.. ఇలా పలు రకాల పిటిషన్లు వేయడంతో దాదాపు 15 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. ఐదేళ్లు దర్యాప్తునకే సమయం పట్టింది. 2009 నుంచి 2014 వరకు సీబీఐ నాలుగు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఓఎంసీ వ్యవహారంలో 2011లో ఛార్జిషీట్‌ను తొలిసారి వేయగా.. 2014లో తుది ఛార్జిషీట్‌ తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిగింది. 219 మంది సాక్షులను విచారించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు సాక్ష్యాలు, ఆధారాలను సీబీఐ సేకరించింది. అనంతపురంలోని ఓబుళాపురంలో గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సీబీఐ ఆధారాలు సేకరించింది. అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు- సీబీఐ గుర్తించింది. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి ఆధారాలు, సాక్ష్యాల సేకరణతో 2014లో తుది ఛార్జిషీట్‌ దాఖలైంది. విదేశాలకు అక్రమంగా దాదాపు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినావిూ లావాదేవీలు జరిగినట్లు- గుర్తించామని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసు విచారణలో మొత్తంగా 3337 డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్‌ చేపట్టినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందగా.. ఏ6 శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది. మొత్తంగా ఈ కేసునుంచి మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట దక్కడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా:సబిత
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు అండగా నిలిచారన్నారు. ఈ తీర్పు అనంతరం ఆమె కోర్టు వద్ద విూడియాతో మాట్లాడుతూ.. ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో నన్ను చేర్చడంపై బాధ పడ్డాను. న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మాను. ఈరోజు అదే జరిగింది. కానీ, ఇన్నేళ్లుగా నేను పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలినని, జైలుకు పోతానని మాటలు అంటుంటే ఎంతో బాధపడ్డాను. అలా ప్రచారం చేసినా నా జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలు నాపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. ఎవరెన్ని మాట్లాడినా నమ్మకుండా నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా నాతో పాటు ఉండి ధైర్యం చెప్పిన అందరికీ కృతజ్ఞతలని అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు- మరో నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాంపల్లి కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2004 నుంచి 2009 మధ్య వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్లో సబితా గనుల శాఖ మంత్రిగా పని చేశారు. సబితా హాయాంలోనే ఓబులాపురం మైనింగ్‌ స్కామ్‌ వెలుగు చూడటంతో సీబీఐ అధికారులు ఆమెను కూడా కేసులో నిందితురాలిగా చేర్చారు.

 

తాజావార్తలు