కేసీఆర్ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
హైదరాబాద్, (జనంసాక్షి) : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరువేసుకుంటున్నది. సబ్బండవర్గాల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతున్నది. సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు? ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? అన్న చర్చ జోరుగా జరుగుతున్నది. సోషల్ మీడియాతోపాటు బయట ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ జరుగుతున్నది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. అనాలోచిత నిర్ణయాలతో, అసమర్థ పాలనతో ప్రజలను గోసపుచ్చుకుంటున్నది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నది. కొత్త పథకాల సంగతేమో కానీ, ఉన్న పథకాలకు కూడా నిధులు విదల్చడం లేదు. మరీ ముఖ్యంగా తొమ్మిదిన్నరేండ్ల పాటు కుషాల్‌గా బతికిన రైతన్నకు నేడు కంటిమీద కునుకులేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, రేవంత్‌రెడ్డిపైనా సబ్బండ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సుదీర్ఘ విరామం తరువాత బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనుండటం కూడా ఉత్కంఠకు కారణమైంది. సార్ ఏం మాట్లాడుతారు? ఏ అంశాలను ప్రస్తావిస్తారు? అని రైతులు, ఆటో కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, రేవంత్ పాలనా వైఫల్యాలను చీల్చి చెండాడటం ఖాయమని చెప్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరో విధమైన ఉత్సాహం నెలకొన్నది. ప్రతి ఒక్కరిలో ఉద్యమం నాటి స్ఫూర్తి కనిపిస్తున్నది. పార్టీ ఏర్పాటు నుంచి ఉద్యమకాలం నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.