భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రెండు దేశాల మధ్య సిద్ధాంత ప్రస్తావనను తీసుకువస్తూ.. అన్ని అంశాల్లో హిందూ, ముస్లింలు వేర్వేరని వ్యాఖ్యానించారు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షల్లో హిందూ, ముస్లింలు వేర్వేరని పేర్కొన్న అసిం మునీర్.. వాటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడిందన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారని, వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అసిం మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.