అగ్రికెం మూసే వరకు పోరాటం

సీఎం దృష్టికి తీసుకెళ్తాం
శ్రీకాకుళం, జూలై 26 : నాగార్జున అగ్రికెం పరిశ్రమను శాశ్వతంగా మూసేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు, పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో గల అగ్రికెం పరిశ్రమ గేటు ముందు అఖిలపక్ష నాయకులు, వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఈ మేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం పర్యటనను ఈ నియోజక వర్గంలో రద్దు చేయడం అన్యాయమన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని భయపడి ఎంపీ బొత్స ఝూన్సీ పర్యటనను రద్దు చేయించడం అన్యాయమన్నారు. ప్రజల సమస్యల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే అధికార పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రికెం సమస్యను ఎలాగైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పరిశ్రమ మూసివేతకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే వచ్చే నెల 1వ తేదీ నుంచి పోరాటం ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు, సనపల నారాయణమూర్తి, తాండ్ర ప్రకాష్‌, సువ్వారి సన్యాసిరావు, వ్యతిరేక పోరారకమిటీ సభ్యులు శ్రీనివాసానందస్వామి, మురళీధర్‌ బాబా, గట్టెం రాములు, డి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.