అధికారమే అన్ని పార్టీల లక్ష్యం

మోడీ పుణ్యమా అని విపక్షాలు ఏకమయ్యాయి. ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. అన్ని పార్టీలు దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయ్యాక భేషజాలు లేకుండా కలసి పోరాడాలన్న సంకల్పాన్ని ప్రకటించాయి. అయితే ఇప్పటికే అధికారంలో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల్లో వీరు వెలగబెట్టిం దేవిూ లేదు. ఎపిలో సిఎం చంద్రబాబు పాలన నానాటికీ తీసికట్టుగా తయారయ్యింది. ఎంతసేపు కేంద్రాన్ని దుయ్యబడుతూ సాగుతున్న బాబు పెద్దగా చేసిందేవిూ లేదన్న భావన ప్రజల్లో ఉంది. అలాగే అగ్రిగోల్డ్‌ లాంటి సమస్యలు పక్కన పెట్టారు. చిన్నిచిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మమతా బెనర్జీ పూర్తిగా శారదా కుంభకోణంలో ఇరుకుక్కు పోయారు. ఇక ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలన వెగటు పుట్టిస్తోంది. అలాగే యూపిఎ పదేళ్ల కాలంలో అనేక కుంభకోణాల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్‌ ఏనాడూ ప్రజల గురించి,దేశం గురించి సరిగా ఆలోచన చేయలేదు. వారసత్వ రాజకీయాలు నెరపుతూ అధికారం కోసం అడ్డదారులు తొక్కిన చరిత్ర దానిది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల ముందు ఏకమై పోటీకి సిద్దం అని అంటున్నారు. వీరు తమ రాష్ట్రాల్లో పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ఇకపోతే ప్రధాని మోడీ కూడా సమాఖ్యకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో విఫలం కావడం వల్లనే ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగింది. ఉదాహరణకు కేబుల్‌ చట్టాన్ని తీసుకుంటే ఇప్పుడు కేబుల్‌ కోసం సామాన్యులు నానా యాతన పడుతున్నారు. తాజా నిర్ణయంతో తక్కువ ధరలకే ఛానళ్లు ఎంచుకోండని చెబుతున్నా తడిసి మోపెడు అవుతోంది. ఏ ఛానల్‌ అయినా స్వేఛ్చగా చూసే హక్కును ప్రజలు కోల్పోయారు. ఇప్పుడు 200 రూపాయలుగా ఉన్న నెలవారీ ధరలు  కనీసంగా 350కి పెరిగింది. నోట్లరద్దు, జిఎస్టీ వంటి నిర్ణయాలు, బ్యాంకుల నిర్వీర్యం మనకు మోడీ ప్రసాదించిన వరాలుగా చూడాలి. అందుకే ప్రజలు విపక్షాల కూటమిని పెద్దగా తప్పుపట్టడం లేదు. మోడీ పాలన చక్కగా ఉండివుంటే వారు ఇవాళ ఏకమైనా ప్రజలు తిరస్కరించేవారు. కానీ వారంతా ఏకమయ్యేలా చేసిందీ మోడీయే. మాజీ కేంద్రమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో విపక్ష పార్టీ నేతలు రెండు గంటల పాటు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చించారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడాలని, ఈ విషయంలో తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టు కుంటామని చెప్పారు. పొత్తులపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. త్వరలో మరోసారి సమావేశమై చర్చలు జరుపుతామని టీడీపీఅధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. సమావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా తదితరులు కూడా పాల్గొన్నారు.ఇంతకాలం సమాఖ్య స్ఫూర్తికి ఎక్కడా భంగం వాటిల్లకుండా అన్ని ప్రాంతాల ప్రజలను కలిపి ఉంచి సఖ్యత సాధించేందుకు భారత్‌ ఐక్యత చాటింది. కానీ మోడీ రాకతో అక్కడక్కడా ఇప్పుడు విూరు వేరు….మేము వేరు అన్న ధోరణి ప్రబలుతోంది. నిజానికి ప్రభుత్వాలు ఏవైనా అభివృద్ది విషయంలో అంతా భారత్‌ ఒక్కటే అన్న అభిప్రాయం రావాలి. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ చేయాలి. అతిగా జోక్యం చేసుకుని రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కరాదు. జాతి యావత్తూ పటిష్ఠంగా ఉండేలా, ఉమ్మడిగా అభివృద్ధి పథంలో పయనించేలా చూసుకునే బాధ్యత ఖచ్చింతగా కేంద్రానిదే. రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదా అభివృద్ది చేయడం అన్నది దేశాభి వృద్దిలో భాగం తప్ప మరోటి కాదు.  రాజ్యాంగం ప్రకారం కేంద్ర- రాష్ట్ర జాబితాలలోని సున్నితమైన అంశాలను ఎలా నెరుపుకోవాలో ఇరువురి మధ్య సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో రాజ్యాంగం స్పష్టం చేసింది. రాచరిక ప్రభుత్వాలకు చరమ గీతం పాడి, ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పినా దురదృష్ట వశాత్తూ గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూనుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం అధినేతలపై కక్షగట్టడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉంది. అలాగే ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లోనూ నిరంకుశ విధానాలను అవలంబిస్తూ రాజ్యం తమ సొత్తు అన్నచందంగా పాలన సాగిస్తున్నారు. అందుకే వివిధ కుంభకోణాలు పుట్టుకుని వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యమేలుతున్నారు. దీంతో రాష్ట్రాలు,కేంద్రం ముందుకు సాగడం లేదు. సామాన్యులకు న్యాయం జరగడం లేదు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రాల తీరు సరిగా లేదు. ప్రజా ప్రభుత్వాలకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అవసరం మేరకు తమ అజమాయిషీని చూపితే కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బలపడి దృఢమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి.దురదృష్టవశాత్తూ తమ రాజకీయ ప్రాబల్యం కోసం పదేపదే తమ అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చాక ఓ అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్నిదెబ్బతీసేలా ప్రవర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్టాల్ర స్వయం ప్రతిపత్తిని కాపాడు తూనే దేశరక్షణ, కరెన్సీ, విదేశాంగ విధానాలు తదితర అంశాల్లో కఠినంగా ఉండడంలో తప్పులేదు. కాని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదు. అలాగే ప్రతి రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న పార్టీలు  కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను నెరపడం ద్వారా కేంద్రం జోక్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను  కలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు దేశంలో ప్రస్తుత పార్టీలు తమ బాధ్యతలను విస్మరించి పాలన సాగిస్తున్నాయి. అధికారమే పరమావధిగా జట్టు కడుతున్నాయి. ఈ దశలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం లేకుండా పోతున్నది. అందుకే ప్రజలు పాలకుల తీరుపై అసహనంగా ఉన్నారు.