అర్థవంతమైన సూచనలు చేయండి ఇన్‌ఛార్జి ఉపకులపతి భగవత్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 23 : యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి దీనికి సహకరించాలని డా. బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆర్‌.జి.భగవత్‌కుమార్‌ అన్నారు. యూనివర్శిటీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఉపయోగపడుతుందని సూచనలు చేస్తే కొందరు దాని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. అర్థంలేని ప్రశ్నలతో ఎటువంటి చిరునామా లేకుండా ఫిర్యాదులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై దరఖాస్తుదారుడి పూర్తి చిరునామా ఉంటేనే సూచలను, సలహాలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సబ్జెక్టు కాంట్రాక్ట్‌ నియామకాల ఎంపికలను వీడియో తీసి ప్రతిభావంతులనే నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 26న ప్రముఖ సైకాలజిస్ట్‌, మోటివేటర్‌ సుబాష్‌ చంద్రన్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నియామక ప్రక్రియ ప్రారంభం:- యూనివర్శిటీలో ఆరు కోర్సుల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందికి బదులుగా ఒప్పంద సబ్జెక్టు అధ్యాపకుల(కాంట్రాక్ట్‌)ను నియమించేందుకు వర్శిటీలో ప్రిన్సిపల్‌ మిర్యాల చంద్రయ్య పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థులతో విద్యార్థులకు పాఠలు చెప్పించారు. ఎంపిక ప్రక్రియను వీడియో తీయించారు. బయోటెక్నాలజీ, సోషల్‌వర్క్‌, గణితం, రసాయనశాస్త్రం, స్పెషల్‌ బి.ఎడ్‌, జియోసైన్స్‌ కోర్సులకు సంబంధించి 13 సబ్జెక్ట్‌లకు నియామకాలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు మరో రండు రోజుల్లో తెలియజేస్తామని వర్శిటీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌, సీడీసీ డీన్‌ జి.తులసీరావు తదితరులు పాల్గొన్నారు.