ఆగస్టులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరు, జూన్‌ 27 : ఏలూరు మండలంలో ఆగస్టులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు వాకర్స్‌ అసోసియేషన్‌ గవర్నరు వి.సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో బుధవారంనాడు ఇండోర్‌ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో 60మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను, ఇతర పరికరాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేదలు కేటరాక్ట్‌ జబ్బుతో బాధపడుతున్నారని, ఆపరేషన్‌ చేయించుకోడానికి డబ్బులు లేక చూపును కోల్పోతున్నారన్నారు. ఇండోర్‌ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు పులి కుమారస్వామి రాజు మాట్లాడుతూ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నా మని, ఇందులో భాగంగా 60 మంది చిన్నారులకు 300 నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, పేద విద్యార్థులకు అందజేశారు. ప్రతి మనిషి నిత్యం నడక అలవాటు చేసుకోవాలని సంఘం నాయకుడు గంధం రామారావు అన్నారు. కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులు లక్ష్మణరావు, సిహెచ్‌ గోవింద్‌, ఎన్‌.రాఘవ రావు, నాగేశ్వరరావు, జి.రాఘవ, ఎస్‌.నరసింహులు, బదరినాధ్‌, ఎస్‌.రమేష్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.