ఆదర్శ రైతుల్ని ఆంబోతులనడం సరికాదు

టిడిపి నేత ఎర్రన్నాయుడు
శ్రీకాకుళం, జూన్‌ 24 : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదర్శ రైతులను ఆంబోతులు అనడం సరికాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు తెలిపారు. స్థానిక ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రన్నాయుడు మాట్లాడారు. వ్యవస్థలో లోపాలు ఉంటే చెప్పాలి తప్ప ఇలా మాట్లాడకూడదని హితవుపలికారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని అన్నారు. నరసన్నపేటలో కాంగ్రెస్‌ను గెలిపింనందునే మంత్రి అలా మాట్లాడుతున్నారని అన్నారు. జిల్లా అధికారుల బెదిరింపులకు భయపడకుండా చట్టానికి లోబడి పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వం పిల్లలకు పుస్తకాలు అందజేయడంలో రైతులకు విత్తనాల పంపిణీలోను విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పాలించే అర్హత ఉందా అని ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, కూన రవికుమార్‌, నాగావళి కృష్ణ, ఎస్‌.వి.రమణ, శీర రమణ తదితరులు పాల్గొన్నారు.