ఆదివాసులకు ఆదరణేది ?

‘ఆగస్టు 9వ తారీఖు ప్రత్యేకతేందని అని ఓ సార్‌ స్టూడెంట్‌ను ప్రశ్నిస్తే, విద్యార్థి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా ? సినిమా యాక్టర్‌ మహేశ్‌బాబు బర్త్‌ డే సార్‌’ అని. కానీ, ఆగస్టు 9 గురించి ఉన్నత వర్గాలకు అంతగా తెలియకపోవచ్చు. ఉన్నత వర్గాలకే కాదు పాలకవర్గాలు కూడా ఆ రోజు ప్రత్యేకతను మరిచిపోయాయి. 1982లో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది ఆగస్టు 9న ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. అంతేగాక, 1994 నుంచి 2004 వరకు, 2004 నుంచి 2014 వరకు గల కాలాన్ని ఆదివాసీ దశాబ్దంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ఇలా తీర్మానించడం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే. ఆదివాసీలు బాగు పడాలని, వేల సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వారు ఈ కాలంలో అభివృద్ధి చెందేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని. కానీ, ఈ ఉన్నతాశయాన్ని అమలు చేయడంపై అన్ని దేశాల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఈ రోజును ఓ తంతుగా నిర్వహించి ఊరుకుండి పోతున్నాయి. పక్కోడి సంగతి మనకెందుకు గానీ, మన దేశం కూడా ఆదివాసీలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. ఆదివాసీల రక్షణ కోసం చేసిన చట్టాలు ఏ మాత్రం అమలుకు నోచుకోకపోగా, అణగదొక్కబడుతున్నాయి. ఆదివాసీలపై జరుగుతున్న అత్యాచారాలకు మన దేశంలో లెక్కే లేదు. మావోయిస్టుల సాకు చూపి పోలీసు బలగాలను ఆ అమాయకులను కాల్చి చంపడం, తుపాకులు ఎక్కుపెట్టి ఆదివాసీ మహిళలను, అమ్మాయిలను చెరచడం సర్వసాధారణమై పోయింది. రాజ్యాంగంలోని 10వ భాగంలో 5,6 షెడ్యూళ్లలో ఆదివాసీ సంక్షేమ చట్టాలను అమలు చేయడానికి గత 65 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా కృషి చేయలేదన్నది కాదనలేని నిజం. ఆదివాసీలకు భూ సమస్య రాకుండా ఉండాలని చేసిన 1/70 చట్టం మన రాష్ట్రంలో అమలులోకి వచ్చినప్పటి నుంచి 7 లక్షల 50 వేల ఎకరాల భూమి ఆదివాసేతరుల చేతిలోనే ఉందంటే, ఆ చట్టం ‘ఎంత బాగా’ అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీలకు పోడు భూములిచ్చి ఉమ్మడి సంప్రదాయక హక్కులు అడవిపై కల్పించే అటవీ హక్కుల చట్టం-2006 నేడు ఆదివాసేతరులకు చుట్టంగా మారింది. ఆదివాసీలకు చెందాల్సిన భూములను బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో కొల్లగొడుతున్నారు. ఈ విషయాన్ని స్వయాన ప్రభుత్వమే నియమించిన డి.వి.ఎల్‌.ఎన్‌.మూర్తి, కోనేరు రంగారావు కమిటీలే వెల్లడించినా ఆ నివేదికపై నేటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 1998 షెడ్యూల్డు ప్రాంతాల విస్తరణ చట్టం గ్రామ సభలకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి అడవుల్లో ఉండే ఆదివాసులకు అవగాహన లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేమిటంటే తమ కోసం ఇన్ని చట్టాలున్నాయన్న సంగతి కూడా పాపం.. ఆదివాసీలకు తెలియదు. తమ స్వార్థం కోసం పాలకులు ఈ చట్టాను తుంగలో తొక్కుతున్నారు. ఒకవేళ ఈ చట్టాల గురించి తెలిసినా అమలుకు నోచుకుంటదన్న ఆశ కూడా వారిలో లేదు. ఎందుకంటే, 2007 ఆగస్టు 20న 22 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు తమను అత్యాచారం చేశారని వాకపల్లి గ్రామ ఆదివాసీ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసినా సదరు మహిళలకు న్యాయం జరుగలేదు. చట్టాలు ‘ఇంత పకడ్బందీగా’ అమలవుతుంటే ఆదివాసీలు వాటిని ఎలా నమ్ముతారు ? ఈ ఒక్క సంఘటన చాలు ఆదివాసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంతుందో తెలుసుకోవడానికి ! మొన్నటికి మొన్న తమ సంప్రదాయ విత్తనాల పండుగ కోసం ఆదివాసులను కోబ్రా పారా మిలిటరీ బలగాలు, సి.ఆర్‌.పి.ఎఫ్‌. బలగాలు ఊచకోత కోశాయి. ఈ సమయంలోనూ ఆదివాసీలను ఆదుకున్న నాథుడే లేడు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాల్లో ఇది కొంత భాగమే. అతి ప్రమాదకరమైన, ఆదివాసీల ఉనికికే ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. నారాయణపూర్‌, బస్తర్‌ ప్రాంతాల్లోని 750 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని చూస్తున్నది. పేరుకు సైనిక శిక్షణ గానీ, అసలు కారణం మాత్రం మావోయిస్టుల ఏరివేత కోసమే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే, హెలికాప్టర్లలో బలగాలు దింపుతున్నదని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ‘తన పని’ తాను చేసుకుపోతున్నది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో మావోయిస్టులను ఏరివేయాలని చూస్తున్నది. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తన నియంతృత్వ నిర్ణయాలతో ఆదివాసీల ఉనికికే ప్రమాదం తెస్తున్నదని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అసలు ఉద్దేశం మావోయిస్టులతో ఈ ప్రాంతాలు ఖాళీ చేయించి, ఆదివాసీలను నయానో, భయానో లొంగదీసుకుని ఇక్కడి అపార ఖనిజ సంపదను బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టాలని కుట్రలు చేస్తున్నదని విమర్శిస్తున్నాయి. ఇదే జరిగితే ఇక్కడి అడవుల్లో భవిష్యత్తులో ఒక్క ఆదివాసీ కూడా కనబడడని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నది. మన రాష్ట్రమే కాదు.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, ఒడిషా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ గురువారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలోని గూడేల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపై ఒకరోజు శాసన సభలో చర్చ చేపడుతామని, గిరిజనాభివృద్ధికి ఇప్పటి వరకు 1740 కోట్ల రూపాయలు కేటాయించామని, లక్షా 67 వేల ఎకరాల భూమిని గిరిజనులకు పంచామని, మరో 5 లక్షల ఎకరాల భూమిని పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. స్పీకర్‌ నోట ఈ మాట విన్న విజయనగరం గిరిజనులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంజారాలు ఏర్పర్చుకున్న కాలనీలో నుంచి వాళ్లను వెళ్లగొట్టి, ఓ గిరిజన తెగ నోట్లో మట్టి కొట్టి, బంజారాహిల్స్‌గా నామకరణం చేసి, భూతల స్వర్గంగా మార్చి సకల సుఖాలు అనుభవిస్తున్న నాయకులు ఎక్కడో రాజధానికి దూరంగా వేల కిలోమీటర్ల ఆవల ఉండే తమ కోసం ఏదో చేస్తారట.. అంటూ పెదవి విరిచారు. శతాబ్దాల నుంచి అడవుల్లో ఉంటున్న ఆదివాసీలను, కాంక్రీట్‌ జంగల్‌లాంటి నగరాల్లోరి తరిమి, తల్లిలాంటి అడవి ఒడి నుంచి దూరం చేయాలని చూస్తున్న ఈ పెద్ద ‘గద్దలు’ ఆదివాసీల కోసం ఇన్నేళ్ల నుంచి అమలు చేయని చట్టాలను, ఇకపై ఆచరణలోకి తెస్తామంటే ఆదివాసులతోపాటు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే, ఆది నుంచే పాలకులు ఆదివాసులను నిరాదరణకు గురి చేస్తున్నారన్న విషయం ఆ అడవి బిడ్లకు మాత్రం తెలియదా !