జూబ్లీహిల్స్‌ దెబ్బకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంతు

` మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం
` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం
` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం
` ఓ పార్టీకి డిపాజిట్‌ గల్లంతైతే, మరో పార్టీ నాలుగు ముక్కలయ్యింది
` మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మిర్యాలగూడ(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ విజయంతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంత్తైయ్యాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల చెమట, రక్తం, త్యాగంతో కాంగ్రెస్‌ ను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని మర్చిపోలేమని, వారు చేసిన మేలుకు రుణం తీర్చుకునేందుకు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, నీది పారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 4 కోట్ల 41 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు భవనం, రూ.2 కోట్ల 25 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవనం లను ప్రారంభించిన అనంతరం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.75 కోట్ల 25 లక్షలతో వ్యయంతో చేపట్టనున్న పనులతో పాటుగా, రూ. 74 కోట్ల వ్యయంతో వేములపల్లి మండలం శెట్టి పాలెం నుండి మిర్యాలగూడ మండలం అవంతిపురం వరకు నిర్మించనున్న రింగురోడ్డు పనుల అభివృద్ధి పనులకు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌ లతో కలిసి వారు శంకుస్థాపనలు చేశారు. అనంతరం హనుమాన్‌ పేట ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడు రెండు పూటలా కడుపునిండా అన్నం తినేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సన్నబియ్యంను రేషన్‌ ద్వారా అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుత విజయాన్ని సాధించడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. ఈ ఉపఎన్నిక విజయంతో ఓ పార్టీకి డిపాజిట్‌ గల్లంతు కాగా మరో పార్టీ నాలుగు ముక్కలైందన్నారు. ఓటమిని అంగీకరించాల్సిన బిఆర్‌ఎస్‌ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ మరింతగా దిగజారి పోయిందన్నారు. ఓటమిపాలైనప్పటికీ కేటీఆర్‌ లో అహంకారం మాత్రం తగ్గలేదని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సుమారు రూ. 238 కోట్ల నిధులతో ప్రతి రోడ్డును డబల్‌ రోడ్డుగా మారుస్తామని తెలిపారు. మిర్యాలగూడ లోని కేఎన్‌ఎం కళాశాలను ప్రభుత్వ కళాశాల గా మార్చేందుకు ఈ ప్రాంతం వారితో కలిసి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్సార్‌ ను కలిసి కొట్లాడిన సంగతిని గుర్తు చేశారు. మళ్లీ అదే కెఎన్‌ఏం డిగ్రీ కళాశాలలో నూతన భవనాన్ని ప్రారంభించడానికి రావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. మన ఎంపీ రఘువీర్‌ రెడ్డితో కలిసి కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు 6 గ్యారెంటీల పథకంతో అన్ని రంగాల ప్రజలకు అభివృద్ధి పలాలను అందిస్తున్నామన్నారు. సుమారు రూ. 60 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి రాష్ట్ర అభివృద్ధికి కంకణ బద్దులుగా పని చేస్తున్నామన్నారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. మిర్యాలగూడలో రూ.74 కోట్ల వ్యయంతో 14.8 కిలోమీటర్ల పొడవున శెట్టిపాలెం నుండి కాల్వపల్లి మీదుగా అవంతిపురం వరకు నిర్మితమవుతున్న రింగురోడ్డు పనులను రెండు సంవత్సరాల వ్యవధిలోని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత తమదే అన్నారు. అదేవిధంగా రూ. 57 కోట్ల నిధులతో మేజర్‌ కాలువ లైనింగ్‌ పనులను చేపడుతున్నట్లు, రూ. 8 కోట్ల వ్యయంతో దుబ్బ తండా చెక్‌ డాం, రూ. 9 కోట్ల వ్యయంతో రావులపెంట చెక్‌ డాం, అదేవిధంగా రూ.7 కోట్ల 92 లక్షల వ్యయంతో ఆగమోత్కూర్‌ ఫీడర్‌ ఛానల్‌ తో పాటుగా నిర్మాణంలో ఉన్న 5 లిఫ్ట్‌ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పెండిరగ్‌ లో ఉన్న అన్ని రకాల పనులను పూర్తి చేయుటకు నిధులను మంజూరు చేయిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా తన ఎంపీ నిధులతో మిర్యాలగూడలో బాలికల గురుకుల హాస్టల్‌ తో పాటు జూనియర్‌ కళాశాలలో మరో అదనపు భవన నిర్మాణానికి నిధులను అందిస్తానని తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవతోనే ప్రజల ఆశీర్వాద బలముతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంను తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు కేవలం మాటలకే పరిమితం అయ్యారని తాను ఆచరణలో చూపిస్తున్నానని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎన్నో ప్రమాదాలకు నిలయంగా మారిన బైపాస్‌ రోడ్డులో ఫ్లైఓవర్‌ నిర్మాణాలను చేపట్టి మిర్యాలగూడను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌ తో పాటు డి.ఎస్‌.పి రాజశేఖర్‌ రాజు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్‌ రెడ్డి, చిలుకూరు బాలు, గాయం ఉపేందర్‌ రెడ్డి, మహమ్మద్‌ జావేద్‌, దేశిడి శేఖర్‌ రెడ్డి, భీమేష్‌, బెజ్జం సాయి తదితరులున్నారు.