షేక్‌హసీనాకు ఉరిశిక్ష
` ఢాకా ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు
` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ
ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోరటు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయ చరిత్రను తానై నడిపించిన ఆమెను ’ఉక్కు మహిళ’గా వ్యవహరిస్తుంటారు. కానీ, తన హయాంలో ఏర్పడ్డ ట్రైబ్యునలే.. ఇప్పుడు ఆమెకు మరణశిక్ష విధించింది. ఇటీవలి అల్లర్ల తరవాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొంది ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఆమె ప్రభుత్వం అసమ్మతిని అణచివేసిందని, విూడియాపై ఆంక్షలు విధించిందని, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిందని, భద్రతా శక్తుల అధికారాలను పెంచిందనే ఆరోపణలు వచ్చాయి. 2024లో స్వాతంత్య పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి నిరసనలు చివరికి దేశవ్యాప్త తిరుగుబాటుగా మారాయి. ఈ నిరసనలే హసీనా పాలనను అంతం చేశాయి. ఆమె ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల వల్ల హింస పెరిగింది. ఇది జులై తిరుగుబాటుగా మారింది. ఈ అల్లర్లలో 1,400 మంది వరకు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదించింది. ఆందోళనల కారణంగా హసీనా అధికారం నుంచి వైదొలగి భారత్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అనంతరం బంగ్లాలో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం ’అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ’ను పునరుద్ధరించింది. యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు ఆమే ఒకప్పుడు దీన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే ట్రైబ్యునల్ 2024 నాటి అల్లర్ల విషయంలో హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలు మోపింది. నెలల తరబడి విచారణ జరిపి సోమవారం మరణశిక్ష విధించింది. తన ఎదుగుదలకు తోడ్పడిన దేశమే ఇప్పుడు తన పతనాన్ని శాసించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హసీనా. భారత ఆశ్రయంలో ఉంటూ సరిహద్దు ఆవల ఉన్న బంగ్లాదేశ్ భవిష్యత్తుపై మథనపడుతున్నారు. తనకు విధించిన మరణ శిక్షను ఖండిరచారు. తీర్పు మోసపూరితమన్నారు. అక్కడి ప్రభుత్వమే కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆవేదన చెందారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. నాటి తూర్పు పాకిస్థాన్‌లోని తుంగిపారాలో 1947 సెప్టెంబరు 28న షేక్ హసీనా జన్మించారు. తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ దేశ స్వాతంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించి జాతిపితగా నిలిచిపోయారు. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయం లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. రాజకీయాలకు భిన్నంగా ఆయన విద్యావేత్తగా నిరాడంబర జీవితం గడిపారు. 2009లో ఆయన మరణించే వరకు ఆమెకు తోడుగా ఉన్నారు. వారికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కూతురు ఉన్నారు. 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఘర్షణల్లో ఆమె తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికి బయటపడ్డారు. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగొచ్చారు. దేశానికి రాకముందే ఆమెను అవావిూ లీగ్ పార్టీ తమ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దేశానికి తిరిగి వచ్చే సరికే హసీనా ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా ఆమె కోసం వేచి చూస్తున్నారు. హత్యకు గురైన అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్యే ఈ ఖలీదా. వీరిద్దరే తమదైన సిద్దాంతాలు, పోరాటాలతో మూడు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను రచించారు. హసీనా మొదటిసారి 1996లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో అధికారం కోల్పోయారు. 2008లో భారీ విజయం సాధించి సుదీర్ఘ పాలన మొదలుపెట్టారు. 2014, 2018 ఎన్నికల్లోనూ అవావిూ లీగ్ పార్టీయే గెలిచింది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. ఆమె పాలనలో బంగ్లాదేశ్ చాలా వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించింది. పద్మా వంతెన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పేదరిక నిర్మూలనలో దేశం పురోగమించింది. బంగ్లాదేశ్ ప్రపంచ వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఈ ప్రశంసలతో పాటే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
తీర్పు మోసపూరితం..
` ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్ర చేసి నాకు శిక్ష పడేలా చేసింది
` నాకు నేను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదు : హసీనా
న్యూఢల్లీి(జనంసాక్షి):బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణ శిక్ష విధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండిరచారు. ఈ తీర్పు మోసపూరితమైనదన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని హసీనా అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధివంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 2010లో బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వం నడిపించిందని గుర్తు చేశారు. మయన్మార్‌లో హింస చెలరేగడంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామన్నారు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాలోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ.. బంద్ ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఆమె దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ షేక్ హసీనా (%ూష్ట్రవఱసష్ట్ర నaంఱఅa%)ను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది. గతేడాది బంగ్లాలో అల్లర్లు జరిగిన సమయంలో తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించి.. చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.
ఇప్పటికైనా హసీనాను మాకు అప్పగించండి
` భారత్‌కు బంగ్లా లేఖ
` తీర్పును తాము గమనించాం
` ఆ దేశంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం
` బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం
` స్పందించిన భారత్
ఢాకా(జనంసాక్షి): మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇక అప్పగించాల్సిన తరుణం ఏర్పడిరదని భారత్‌కు బంగ్లాదేశ్ విన్నవించింది. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు దౌత్యపరంగా సరైనది కాదని బంగ్లా స్పష్టం చేసింది.ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ,.. భారత్‌కు లేఖ రాసింది.మరణశిక్ష పడ్డ షేక్ హసీనా అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ఇది స్నేహ పూర్వక బాధ్యత అని కూడా బంగ్లాదేశ్ లేఖ ద్వారా స్సష్టం చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తులకు మరే ఇతర దేశం ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు న్యాయం పట్ల నిర్లక్ష్యమే అవుతుందని పేర్కొంది.కాగా ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాను దోషిగా తేల్చుతూ మరణశిక్ష విధించింది. అల్లర్ల కేసులో ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలపింది. హసీనా మానవత్వాన్ని మరిచిపోయి.. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారని, ఆమె చేతులో రక్తం నిండిపోయి ఉన్నాయని, అందుకు ఆమెకు మరణశిక్షే సరైనది అంటూ తీర్పు వెలువరించింది.అయితే హసీనా తొలిసారి స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుని పేర్కొన్నారు. తనపై కుట్రతో, రాజకీయ దురద్దేశంతో చేసిన కుట్రగా ఆమె అభివర్ణించారు.ఇదిలా ఉంచితే, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఈ క్రమంలోనే మన దేశానికి దౌత్య సమస్య మరొకటి చేరింది. ఇందులో హసీనా అప్పగింత వ్యవహారం.గత ఏడాది ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేయగా, ఆమె మరణశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి ‘అప్పగింత’ వ్యవహారంపై బంగ్లాదేశ్ చకచకా పావులు కదుపుతోంది.
భారత్ ఏమన్నదంటే!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’ మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ స్పందించింది. ఈ తీర్పును తాము గమనించినట్లు తెలిపింది. ఓ పొరుగు దేశంగా.. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హసీనాకు విధించిన శిక్షను దృష్టిలో ఉంచుకుని ఆమెను వెంటనే అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ చేసిన డిమాండ్‌పై భారత్ స్పందించలేదు.విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవి వీడిన షేక్ హసీనా.. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చారు. నాటినుంచి దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. స్వదేశంలో ఆందోళనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆమెపై కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ఐసీటీ సోమవారం హసీనాను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె ఖండిరచారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు.


