ఆదుకునే వారు లేక

ఆదుకునే వారు లేక ..
ఒంటికి నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాలిన గాయాలతో సతమతంఆపన్న హస్తం అందించిన పాస్టర్లుమానకొండూరు, ఆర్ సి, మార్చి 29( జనం సాక్షి)దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో దీనుల హీనుల, పాపుల, పతితుల ఉద్ధరించగా యుగయుగాలలో.. అన్న చందంగా మరణం అంచుల దాకా వెళ్ళిన వ్యక్తికి ఆపన్న హస్తమందించి కరుణామూర్తులుగా మారి, ఆ అభాగ్యునికి అండగా నిలిచి, వెన్నంటి ఉండి మానవత్వం ఇంకా మిగిలి ఉంది లోకంలో అని నిరూపించారు దైవజనులు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామవాసి పుట్ట సంపత్( 40 సంవత్సరాలు) ఆర్థిక బాధలు తాళలేక క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆదుకునే వారు లేక, ఒంటిపై కాలిన గాయాలతో, మానసిక ప్రశాంతత కరువై జీవచ్ఛవంలా మారిపోయాడు. చేతిలోనున్న మూడు లక్షలు వ్యయం చేసిన కాలిన గాయాలు మానలేదు. ఆరోగ్యం కుదుటపడే దారి కానరాక, చేతిలో చిల్లి గవ్వలేక నిర్వేదంతో, నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు రక్షించుకునే మార్గం కానరాక ,చెమ్మగిల్లిన నయనాలతో ఆదుకునే  నాథుల కోసం పరితపించాడు. విషయం తెలిసిన  జే ఎం ఐ మినిస్ట్రీ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్, మానకొండూరు నియోజకవర్గ ఐక్య పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, దైవజనులు  ఆహరోన్( పోచంపల్లి సర్పంచ్ అంజయ్య) హుటాహుటిన బాధితుని ఇంటికి చేరుకున్నారు. వారి దీనస్థితి చూసి చలించిపోయారు. ఖమ్మం జిల్లాలోని జేఎంఐ మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాస్టర్ కరుణాకర్ కు అభాగ్యని దీనస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యంలో సందేశాన్ని పంపారు. తక్షణం స్పందించిన దైవజనులు కరుణాకర్ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ తక్షణం మెరుగైన వైద్య సౌకర్యం కోసం ఆసుపత్రికి తరలించాలని దైవజనులు  అహరోనుకు సూచించారు. అహరోన్ తన సొంత వాహనంలో పుట్ట సంపత్ ను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, వెన్నంటే ఉండి నెలకు సరిపడా మందులు, నిత్యవసర సరుకులు అందించారు. మానకొండూరు నియోజకవర్గ ఐక్య ఫెలోషిప్ ఉపాధ్యక్షులు దైవజనులు దాస్, తన వంతు సహాయ సహకారాలు అందించారు. దైవజనుల సహాయానికి సంపత్ కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. దైవజనుల ఔదార్యాన్ని మండల ప్రజలు కొనియాడారు.