ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు : కలెక్టర్‌

ఏలూరు, జూలై 22 : కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మూలంగా జిల్లాలో మరికొన్ని గంటల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని కొన్ని మండలాల్లో విస్తారంగాను, మరికొన్ని చోట్ల చెదురు ముదురుగా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తక్షణ చర్యలు తీసుకునే నిమిత్తం జిల్లాలోని నాలుగు ఆర్‌డివో కార్యాలయాలలో కంట్రోలు రూమ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు వాటి వివరాలను ప్రతి రోజు ఉదయం 9గంటలకు జిల్లా కేంద్రానికి నివేదిక పంపాలని ఆర్డీవోలను ఆదేశించారు. వీటితో పాటు వ్యవసాయశాఖ, మత్స్యశాఖ, డిఎంహెచ్‌వో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ (08812-230617)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షపాతం వివరాలు జిల్లాలో జూన్‌ నుంచి జూలై 22 వరకూ 286.6 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా, ఇంత వరకూ 327.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.