ఆహారం పరబ్రహ్మ స్వరూపం…! కోటి విద్యలు కూటి కొరకే……..! 

అన్నదానానికి మించిన దానం లేదు….!
మన జీవనయానంలో ఆహారానికి ఉన్న విలువేమిటో తెలియజేయడానికి ఈ వాక్యాలు చాలు. మానవాళితో సహా సకల జీవరాశులు మనుగడకు ఆహారం తప్పనిసరి. 2022లో ప్రపంచంలో సుమారు 783 మిలియన్ల ప్రజలు ఆకలిని ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఈ సంఖ్యని మరింత పెంచింది. ఎంతో విలువైన ఆహారం ప్రపంచ వ్యాప్తంగా నిర్లక్ష్యం, నిల్వా చేయడానికి తగిన సాంకేతికత పరిజ్ఞానం లేకపోవడం వంటికారణాల వలన కలుగుతున్న ఆహార నష్టం మరియు వృధా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద పర్యావరణ మరియు ఆర్ధిక సవాళ్. తినడానికి పనికిరాని స్థితిలోనున్న లేదా తినే అవకాశం ఉన్నప్పటికీ విస్మరించబడిన దానిని  ఆహార నష్టం మరియు వ్యర్థం అని చెప్పొచ్చు. ఇది భవిష్యత్తులో ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీసే ప్రమాదం కలిగి ఉండడంతోపాటు ఆహార వ్యవస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. వృధా వలన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే వనరులైన నేల, నీరు, శ్రమ, మూలధనం కూడా వృధా అయినట్లే..! ఇది ఆహార భద్రత, లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఆహార ధరలను పెంపునకు దోహదం చేస్తుంది.  ఈ నష్టం అనేది ఆహారపంట కోతకు వచ్చినప్పటి నుండే మొదలవుతుంది. ఆహారం ఉత్పత్తి, ప్రాసెసింగ్, అమ్మకాలు మరియు వినియోగం దశలలో ఆహారం నష్టం జరుగుతుంది. పంట పండే సమయంలో వచ్చే  తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు, పంటలు కోత తరువాత సరైన పద్దతులలో నిల్వ చేయకపోవడం, రవాణా చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు జరిగే వృధా ఈ దశలలో భాగాలే. ఆహార వృధా కేవలం పంటలకే పరిమితం కాదు. పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటికి కూడా అనువర్తిస్తుంది. ఆహార వ్యర్థాల సూచిక అనేది మొత్తం ఆహార వ్యర్థాలను కొలుస్తుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ( యుఎన్ఇపి ) మరియు వరల్డ్‌వైడ్ రెస్పాన్సిబుల్ అక్రెడిటెడ్ ప్రొడక్షన్ ( డబ్ల్యు.ఆర్.ఎ.పి) లు సంయుక్తంగా ” ఆహార వ్యర్థాల సూచిక ( ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ )  2021 నివేదికను విడుదలచేశారు. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2019లో దాదాపు 931 మిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయని, ఇందులో 61% గృహాలు, 26% ఆహార సేవ మరియు 13% రిటైల్ లనుండి వచ్చాయని తెలిపింది. ఒక సంవత్సర కాలంలో తలసరిగా 39 కిలోల అతి తక్కువ ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేసిన దేశంగా ఆస్ట్రియా, 189 కిలోల అతి ఎక్కువ ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేసిన దేశంగా నైజీరియాలు రికార్డుకెక్కాయి. 2023లో అత్యధికంగా ఆహారాన్ని వృధా చేసే దేశాలుగా మొదటి మరియు రెండు స్థానాలలో చైనా మరియు భారతదేశాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి లక్ష్యించిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ టార్గెట్ 12.3 ని మరియు  ఆహార వ్యర్థాలను 2030 సంవత్సరానికల్లా 50% తగ్గించాలని 2022వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్ బయోడైవర్సిటీ సదస్సులో పాల్గొన్న అన్నీ దేశాలు తీర్మానించాయి.
మన దేశంలో పరిస్థితి:
యు.యన్.ఇ.పి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం, భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 50 కిలోలు లేదా దేశం మొత్తానికి తీసుకుంటే  68.76 మిలియన్ టన్నులు ఉన్నట్లు అంచనా వేయబడింది. ఇది 50 వేల కోట్ల రూపాయలకు లేదా మన దేశ జి.డి.పి లో 1% కి సమానం. ఇది ఇలా ఉంటే దేశ జనాభాలో 15% మంది ప్రతి రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధ పడుచున్నారు. ప్రతీ రోజు 3000 మంది సరైన ఆహారం లేక అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు.
ఆహార వృథాన్ని ఎందుకు తగ్గించాలి :
ఆహారం నష్థం మరియు వృధాలో  పావు శాతం ఆదా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో జీవిస్తున్న  870 మిలియన్ల మందికి ఆహారాన్ని అందించవచ్చు. ఆహార వ్యర్థాలు కుళ్ళడం వలన విడుదలయ్యే 10% గ్రీన్హౌస్ వాయువులు ఓజోన్ పొరకు హాని కలిగిస్తున్నాయి. ఇంకా కార్బన్డయాక్సైడ్ కంటే ప్రమాదకరమైన మీథేన్ వాయువు వెలువడే కారణాన్న మనకు క్యాన్సర్, శ్వాసకోశవ్యాధులు వంటి వ్యాధులు రావడమే కాకుండా అంగ వైకల్యంతో కూడిన పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్యావరణ పరంగా మొక్కలు మరియు జంతుజాతుల క్షీణత జరిగి దాదాపు 70% జీవ వైవిధ్య నష్టానికి ఈ ఆహారవ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి.
పరిష్కారాలు : పంటలు, పండ్లు వంటి వాటిని నిలవాచేయడానికి శీతల గిడ్డంగులును నెలకొల్పడంలో  శాస్త్రీయ పద్ధతులను పాటించాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వాటిని వేగంగా రవాణా చేయడానికి మంచి రోడ్ల సదుపాయం కల్పించాలి. ఆహార పదార్థాలు కల్గిన ట్రక్కులు ప్రమాదాలకు గురికాకుండా వాహన డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇంటికి కావలసిన ఆహార పదార్థాలను అవసరంమేరకే కొనుగోలు చేయాలి. వివాహాలు, పార్టీలు, పండగల సందర్భంగా మిగిలిన ఆహార పదార్థాలను ఫుడ్ బ్యాంకులు లేదా ఆకలితో ఉన్నవారికి లేదా అనాదాశ్రమాలకు ఇవ్వాలి. ఆహార వృధా అరికట్టడానికి ప్రతీ ఒక్కరం పాటుపడాలి.
జనక మోహన రావు దుంగ
యం.యస్సీ, బి. యడ్
అధ్యాపకులు
ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
8247045230

తాజావార్తలు