‘ఇందిరమ్మ బాట’ను విజయవంతం చేయాలి

మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, జూలై 25 : జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించే ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇందిరమ్మ బాట కార్యక్రమం నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన చర్యలపై రాష్ట్ర ఆటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో కలసి అధికారులతో బుధవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటు చేసుకున్న అక్రమాలతో తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ప్రతి గ్రామంలో ఎంతో కొంత నిధులు దుర్వినియోగం అయ్యాయని నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఈ విషయమై తనను నిలదీస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన బలప్రదర్శనకు సంబంధించినది కాదని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతుందీ లేనిది తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలను సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా శాఖల వారు ఆప్రమత్తంగా ఉండాలని అన్నారు. పథకాల అమలులో లోపాలు ఉంటే ఆయన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఆటవీ శాఖ మంత్రి శుత్రుచర్ల విజయరామరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌, శాసన సభ్యులు జగన్‌నాయక్‌, కె.భారతి, ఎం. నీలకంఠం నాయుడు, సత్యవతి, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీలు విశ్వప్రసాద్‌, శ్రీనివాసులనాయుడు, ఎస్పీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.