ఇప్పటికైనా మారండి : రేవంతరెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబును బద్నాం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సిపి పెట్టుకున్నదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ కోర్టులు చీవాట్లు పెట్టినా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం మానడం లేదన్నారు. సుప్రీంకోర్టు విజయమ్మ పిటిషన్‌ తిరస్కరిస్తూ ఎసిబిలో ఫిర్యాదు చేయమని సూచించలేదన్నారు. కానీ వైఎస్‌ఆర్‌సిపి మాత్రం సుప్రీం తీర్పును వక్రీకరిస్తున్నదని ఆరోపించారు. న్యాయ పరిభాషలో ఎక్కడా క్లీన్‌చిట్‌ అనే పదం లేదన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. తమ బురదను మరొకరిపై జల్లేందుకే ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నిక సమయంలో వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌ ఒక్కటేనన్న విషయం రుజువైందన్నారు. రాజకీయ కక్షతోనే బాబుపై ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. చంద్రబాబు తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో ఎటువంటి మచ్చలేని లేని నాయకునిగా, పారదర్శకతతో కూడిన పాలనను ప్రజలకు అందించారన్నారు. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవన్నారు. వైఎస్‌ఆర్‌ పార్టీ కాంగ్రెస్‌లో అంతర్భాగమేనన్నారు. అవినీతి మంత్రులపై తాము చేసిన ఆరోపణలకు నేటివరకు బదులు రాలేదన్నారు. కేబినెట్‌ సమావేశం ఇక జైలులో పెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, 2014 ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.