ఇరోం షర్మిల మళ్లీ అరెస్టు

ఇంపాల్‌,మార్చి 14 (జనంసాక్షి):
వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి (ఏఎఫ్‌ఎస్‌పీఏ) వ్యతి రేకంగా ఉద్యమిస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిలా చానును ఇంపాల్‌ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఆత్మహత్యాయత్నం అభియోగాలపై అరెస్ట్‌ అయిన షర్మిలా చానును విడుదల చేయాలని ఇంపాల్‌ తూర్పు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆమెను జవహర్‌లాల్‌ నెహ్రూ హాస్పిటల్‌ నుంచి పోలీసులు విడుదల చేశారు. అయితే ఆమె నేరుగా తన కార్యాలయానికి చేరుకుని మళ్లీ నిరాహార దీక్షకు పూనుకున్నారు. బుధవారం ఉదయం షర్మిల కార్యాలయానికి వచ్చిన ప్రభుత్వ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసేందుకు యత్నించగా నిరాకరించారు. షర్మిలా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.