ఈనెల 30వ తేదీన కవాతు ఖచ్చితంగా జరుగుతుంది: కేకే

హైదరాబాద్‌: ఈనెల 30వ తేదీన తెలంగాణ కవాతు ఖచ్చితంగా జరుగుతుందనీ దానికి తన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల మద్దతు ఉంటుందని తెలిపారు. కవాతు శాంతియుతంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. పోలీసులు చెచ్చగొట్టకుండా, ప్రభుత్వం అనుమతిస్తే శాంతియుత పద్దతిలో జరుగుతుందని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, లేదా పరిస్థితి చేయిజారిపోతుందని హెచ్చరించారు. కవాతు వాయిదా వేసుకోమని ఐకాస నేతలను ఒప్పించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి తనకు చెప్పిన మాట వాస్తవమేనని కేకే చెప్పారు. కానీ, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది, మూడు రోజుల్లో కవాతు ఉండగా ఇప్పుడు వాయిదా వేసుకోవాలనడం సరికాదేమోనని తాను సీఎంతో చెప్పానని తెలిపారు. తాను ఐకాసతో రాజీప్రయత్నం చేస్తున్నానని వచ్చిన వార్తలు తప్పని ఖండించారు. తెలంగాణ ఎంపీలు పాల్గొంటారా అని పేర్కొన్నారు. కవాతు ఒక్కరోజు కాదు నిరవధికంగా ఉంటుందని ఐకాస నేతలు అంటున్నారు కదా అని విలేఖరులు అడగ్గా ఆ విషయం తనకు తెలియదన్నారు. కోదండరాం టీవీ ఛానెల్‌లో చెప్పడమే చూశానని ఆయన తెలిపారు.