ఉద్యమంలా హరితహారం

C

– ఊరూ వాడా కదలాలి

– సీఎం కేసీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పిలుపునిచ్చారు. హరితహారం రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంపై ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. సుమారు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చిన కేసీఆర్‌… అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రెండో దశ హరితహారం ప్రణాళికలు, ఆయా శాఖల వారీగా కార్యాచరణపై సవిూక్షించారు.  తెలంగాణను పచ్చగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగా హరితహారం రెండోదశ కార్యచరణను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 8న హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జనవాడలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జులై 8 నుంచి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 16 కోట్ల మొక్కలు మాత్రమే నాటగలిగారు. కానీ ఈ సారి మాత్రం సుమారు 41 కోట్ల 85 లక్షల మొక్కలను నాటడానికి అటవీశాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అవసరమైన ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే 4,213 నర్సరీలలో 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు. దాదాపు 197 రకాల మొక్కలను నాటడానికి రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే జాతీయరహదారి పొడవునా మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. కాగా జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి నేషనల్‌ హైవే అథారిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఇకపోతే జులై 11 నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలో 25లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.సచివాలయంలో హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. సవిూక్ష సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూడేండ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ నిర్ధేశించిన విషయం తెలిసిందే. గత ఏడాది కంటే ఈ సారి మూడురెట్లు ఎక్కువగా మొక్కలను ప్రణాళికను సిద్ధం చేశారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 16 కోట్ల మేరకే మొక్కలు నాటగలిగారు. కానీ ఈ సారి మాత్రం సుమారు 41 కోట్ల 85 లక్షల మొక్కలను నాటడానికి అటవీశాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అవసరమైన ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే 4,213 నర్సరీలలో 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో హరితహారం కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టాలని, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. దీనిని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. పాఠశాలలు,గుళ్లు మసీదుఉల, చర్చిలలో కూడా మొక్కలు నాటేలా చూడాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ఎవరికీ వారుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్‌ వరకు ఆయా శాఖలు మూడు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 4న సీఎస్‌ ఆధ్వర్యంలో మరోసారి సమావేశమై తుదిరూపు ఇవ్వాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అన్ని చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారాలు

తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, నదులు, ఉపనదులు, కాలువలు, వొర్రెలు, వంకలు, చెరువుగట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అన్ని రకాల రహదారుల వెంట మొక్కలు నాటాలన్నారు. అవసరాన్ని బట్టి పండ్ల చెట్లు, నీడ చెట్లు, ఔషధ మొక్కలు, పూల చెట్లు నాటాలని సూచించారు. టీవీలు, పేపర్లు, రేడియోలు, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోషల్‌ విూడియాలో కూడా చర్చ జరగాలన్నారు. కవి సమ్మేళనాలు, విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు చొరవ తీసుకొని ప్రతి ఇంటిలో మొక్కలు నాటేలా ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటేలా యాజమాన్యాలు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సవిూక్షలో సిఎస్‌ రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.