ఉధృతమైన జూడాల సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ
అత్యవసర సేవలకు అంతరాయం

సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):ఏడాది పాటు గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో పని చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను నిరసిస్తూ.. జూనియర్‌ డాక్టర్లు సమ్మెను ఉద్ధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించారు. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలు నిలిపివేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయడంతో పాటు గ్రావిూణ వైద్య సేవలకు స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జూనియర్‌ డాక్టర్లు అందుబా టులో లేక, సీనియర్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో జూడాలు అత్యవసర నిలిపివేశారు. అటు గాంధీలోనూ
ఇదే పరిస్థితి. దీంతో ఓపీతో పాటు అత్యవసర వైద్యసేవలు నిలిచిపోయాయి. ఐసీయూ సహా అన్ని విభాగాల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్‌ డాక్టర్లు ఉన్నా సరిపోవడం లేదు. నర్సులు విధుల్లో ఉన్నా వారు ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు, జూడాల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వైద్య సేవలు నిలిచిపోయాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. జూనియర్‌ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఆస్పత్రిలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా సర్కారు స్పందించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హావిూలతో పాటు గ్రావిూణ సర్వీసులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అప్పటిదాకా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సర్కారు స్పందించక పోవడం వల్లే అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జూడాలు విధులను బహిష్కరించారు. విశాఖపట్నంలోని కింగ్‌ జార్జి హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్లు, వైద్య విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారు. వైద్య సేవలు నిలిపి వేసి, ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసిన కలెక్టర్‌ ఆస్పత్రిలో పరిస్థితిని సవిూక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆస్పత్రి సమస్యలపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సాధారణ సేవలు నిలిపివేశారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రి పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు.
ఇబ్బందుల్లో రోగులు..
జూనియర్‌ వైద్యులు విధులకు దూరంగా ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అరకొరగా ఉన్న సీనియర్‌ డాక్టర్లు రోగులను చూసేందుకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉస్మానియా ఆస్పత్రికి రోజూ 1200 మంది రోగులు వస్తుంటారు. వీరికి జూడాలే వైద్య సేవలు అందజేస్తుంటారు. అయితే, వారు సమ్మెకు దిగడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా జూనియర్‌ వైద్యులే రోగులకు ఎక్కువగా సేవలు అందిస్తుంటారు. సీనియర్లు కేవలం అప్పుడప్పుడు మాత్రమే వస్తుండగా.. జూడాలే రోగులను పర్యవేక్షిస్తుంటారు. వారంతా ప్రస్తుతం విధులకు దూరంగా ఉండడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఓపీ సేవలతో పాటు ప్రధాన విభాగాల్లో వైద్య సేవలు స్తంభించాయి. నర్సులే తమకు తెలిసిన రీతిలో సేవలు అందిస్తున్నారు.