ఎంపీల వెలి అప్రజాస్వామికం
– రాజ్యాంగాన్ని కూనీ చేశారు
– ఏఐసీసీ అధ్యక్షురాలు సొనియా
– పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ ధర్నా
న్యూఢిల్లీ,ఆగస్టు4(జనంసాక్షి): నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని , రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇంతమంది సభ్యుల వెలి ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అన్నారు. లోక్‌సభ నుంచి 25 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సభలో ఏకపక్షంగా తమ సభ్యులను బయటకు పంపారని మండిపడ్డారు. దీనిపై పోరాడుతామని ప్రకటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో చేపట్టిన ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా కాంగ్రెస్ నేతలంతా చేతికి నల్లరిబ్బెన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు విపక్షాలు బాసటగా నిలిచాయి. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, బీజేడీ, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను తప్పుబట్టాయి. సభనుంచి 25 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీనియర్‌నేతలు మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, పలవురు ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ప్రధానికి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయం దొరకట్లేదని విమర్శించారు. మోడీ మన్‌కీ బాత్ కాదు దేశ ప్రజల మన్‌కీ బాత్ గురించి తెలుసుకోవాలన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చట్టాన్ని ఉల్లంఘించారనడంలో సందేహం లేదన్నారు. వ్యాపం కుంభకోణంతో వేలాది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయన్నారు. తాము ఎవరి రాజీనామాలు అడగట్లేదని… దేశ ప్రజలే కోరుతున్నారన్నారు. సభ నడవటం ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రధానికి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయం దొరకట్లేదని విమర్శించారు. ఈ విషయంలో తమ ఆందోళన ఆగదని, అవినీతికి కారకులైన వారు దిగిపోవాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్‌నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెన్షన్ హేయమైన చర్య అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఈ చర్య తీసుకుటున్నారని విమర్శించారు. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా పార్లమెంట్ ఆవరణ లో గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు.