ప్రతిపక్షనేత అంటే నమోషీ ఎందుకు?

` ప్రజల తరపున సురవరం పోరాడలేదా
` పేదల కోసం తపించిన మహానేత సురవరం
` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి
` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం
` సురవరం సంస్మరణ సభలో : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. రవీంధ్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరయి మాట్లాడారు. మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చారు. రెండో తరంలో జైపాల్‌రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారు. జైపాల్‌రెడ్డి దక్షిణ భారత్‌ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన యువ ఎంపీగా ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు. అదే కోవలో సురవరం సుధాకర్‌రెడ్డి కూడా గుర్తింపు తెచ్చుకున్ననేత అన్నారు. సిపిఐ కార్యార్శిగా, ఎంపిగా ఆయన చిరస్మరణీయ సేవలు అందించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. ప్రజలకు సురవరం సుధాకర్‌రెడ్డి ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. రాజకీయం అంటేనే అధికారం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉంటాం కానీ, ప్రతిపక్షంగా ఉండలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదని పరోక్షంగా బిఆర్‌ఎస్‌పై విసుర్లు విసిరారు. కమ్యూనిస్టులు మాత్రం ఎన్నేళ్లు అయినా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రజల తరఫున మాట్లాడటం, పోరాడటం పెద్ద బాధ్యత. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు నేతలు ముందుకు రావట్లేదు. సమస్యలపై పోరాడి.. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను దించడంలో కమ్యూనిస్టులు ముందున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా కమ్యూనిస్టులే కారణమని తన నమ్మకం తనదని సిఎం అన్నారు . రవీంధ్ర భారతిలో సురవరం సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు రేవంత్‌. సురవరం చిత్రపటానికి నివాళి అర్పించారు. కమ్యునిస్టులంటేనే ప్రతిపక్షమని అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం,ఆలోచన ఇంకా పెరగాలన్నారు రేవంత్‌. కమ్యునిజం అంటే లైబ్రరీలో దొరికే పుస్తకం కాదని.. కమ్యూనిస్టులంటేనే ప్రజల కోసం కొట్లాడే వాళ్లని అన్నారు. కమ్యూనిస్టులంటే ప్రజలకు ఓ భరోసా,నమ్మకం ఉందన్నారు. సురవరం ఉంటే ఓట్‌ చోరీపై మరింతగా పోరాడే వారరన్నారు. మహారాష్ట్రలో నాలుగు నెలల్లో కొత్తగా కోటి మంది ఓటర్లు పుట్టుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్‌. బీహార్‌ లో 65 లక్షల కొత్త ఓట్లు- వచ్చాయని చెప్పారు. ఓట్ల తొలగింపుతో ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సురవరం చివరి శ్వాస వరకు సీపీఐతోనే ఉన్నారని.. 65 సంవత్సరాల పాటు- ఎర్రజెండా నీడనే ఉన్నారని కొనియాడారు రేవంత్‌. సురవరం సామాజిక చైతన్యం ఉన్నవారన్నారు. సురవరం సుధాకర్‌ రెడ్డి సూచనతోనే తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్‌ రెడ్డి పేరు పెట్టామన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నారాయణ, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీపీఎం నేత బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, గుమ్మడి నర్సయ్య, ప్రొ.హరగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల కోసం నిరంతర పోరాటం
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ- సభ్యుడిగా నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. తనకు కూడా వామపక్ష భావజాలం పట్ల అభిమానం ఉందని పేర్కొన్నారు. సురవరం ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు. రవీంద్రభారతిలో దివంగత సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు- చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు. దశాబ్దానికిపైగా సురవరం, తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు- బీవీ రాఘవులు తెలిపారు. అనేక పోరాటాలు, ఉద్యమాల్లో కలిసి పని చేసినట్లు- వివరించారు. సురవరం గొప్ప ప్రజాస్వామిక వాది అని కొనియాడారు. ఆయన లేని లోటు- పూడ్చలేనిదని పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పుడు తొలిసారి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసినట్లు- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో మళ్లీ కలిసినట్లు- చెప్పారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు. సురవరం నిబద్ధతతో రాజకీయాలు నడిపారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు.