ఎదుటి వారి వైఫల్యాలే రాళ్లుగా పునాది
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం
బిజెపి ఎదుగుదలకు అదే వ్యూహం
హైదరాబాద్,డిసెంబర్5 (జనంసాక్షి) : రాజకీయాల్లో ఎదుటి వారి వైఫల్యాలను ఎండగట్టగలిగితే..తాము అందుకు ప్రత్యామ్నాయం అని చెప్పగలిగితే విజయం సాధించవచ్చని బిజె ఇనిరూపించింది. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు పలకడమే గాకుండా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడడంలో బిజెపి కీలకభూమిక పోషించింది. కేంద్రంలో తెలంగాణ రావడానికి తనవంతుగా పెద్ద కృషిని చేసింది. తెలంగాణ ప్రజలకు అండగా ఉండి నడిచింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా బగా గురుతు. వాటిని కాదనడానికి లేదు. అయితే తెలంగాణ ఏర్పడ్డ తరవాత పరిస్థితులు కెసిఆర్‌కు అనుకూలంగానే ఉన్నాయి. కానీ రానురాను అవి శృతిమించి పాలన అన్నది కటుంబానికి కేంద్రంగా మారడంతో బిజెపి దానిని అందిపుచ్చుకుని..కుటుంబ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రజలు కూడా కెసిఆర్ కుటుంబ పాలనపై విసుగుతో ఉన్నారు. దుబ్బాకలో విజయం, గ్రేటర్‌లో ప్రతికూల ఫలితాలకు ఇవి బాగా దోహదపడ్డాయి. ఇదే అదనుగా బీజేపీ అనుసరించిన వ్యూహం, ప్రత్యేక కార్యాచరణ
ఫలితాలను ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమించి బాధ్యతలను అప్పగించి పనిచేయించి, కెసిఆర్ కుటుంబ పాలనపైనే ఎలుగెత్తి చాటింది. పార్టీ కమిటీలు, పార్టీ శ్రేణులు బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేయడం ఒక ఎత్తయితే కుటుంబపాలన, గడీల పాలన అన్న నినాదాలు బాగా పినచేశాయి. అలాగే ఎంఐఎంతో ఉన్న దోస్తానా కూడా మెజార్టీ హిందువవుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకుని వచ్చాయి. ఇవన్నీ కూడా బలంగా తీసుకుని వెళ్లడంలో బిజెపి వ్యూమాత్మకంగా పనిచేసింది. రోడ్‌షోలు, బస్సుయాత్రలతో ప్రచారం నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కటుఉంబ పాలన, అవినీతికి తాము వ్యతిరేకమని, తమ పోరాటం దీనిపైనే అని అన్నారు. అన్నట్లుగానే అవి ఆలంబనగా చేసుకుని కెసిఆర్‌పై బిజెపి మలి విజయం సాధించింది. ఇకపోతే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా నియిమించారు. పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో మాట్లాడాల్సిన అంశాలను కూడా భూపేంద్రయాదవ్ సూచనల మేరకు రూపొందించి అమలు చేయడం కలిసొచ్చింది. వరదసాయం, కుటుంబ పాలన, హిందూ అనుకూల నినాదాలు, ఎంఐఎం మతతత్వం తదితర అంవాలను ప్రచారంలో ఈటెల్లా వాడారు. అలాగే వివిధ కుల, విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశాలు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహద పడ్డాయి. మాజీమంత్రి డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షు రాలిగా నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. బీసీ సామాజిక వర్గాల్లో గౌడ్, యాదవ, మున్నూరు కాపులతోపాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పనిచేయడం కలిసివచ్చింది. టీఆర్‌ఎస్ ఎంఐఎం మధ్య అవగాహన ఉందని యువత మెదళ్లలోకి ఎక్కించ డంలో బండి సంజయ్ సఫలమ య్యారు. పాతబస్తీపై సర్జికల్ సట్రయిక్స్ చేస్తామని, అక్రమంగా వలస వచ్చిన వారిని, రోహింగ్యాలను ఏరివేస్తామని చెప్పడం వారిని బీజేపీ వైపు మళ్లించింది. మొత్తంగా బిజెపి వ్యూహాలు ఫలించడంలో బండి సంజయ్ కూడా బాగా కష్టపడ్డారని చెప్పాలి. బండిని అధ్యక్షుడిగా చేయడంతో ఆయన నేరుగా కెసిఆర్ ఫ్యామిలీ లక్ష్యంగా తన దుందుడుకు స్వభావాన్ని చాటారు.
ఓ వైపు దుబ్బాక విజయం.. మరోవైపు జీహెచ్‌ఎంసీలో అత్యధిక స్థానాలు గెలుపొందడంతో బీజేపీ ఇప్పుడు సహజంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. అదే వ్యూమంలో పడింది. ఈ విజయాలే సోపానాలుగా, ఈ ఎన్నికల్లో పని చేసిన తీరునే స్ఫూర్తిగా ముందుకుసాగాలని నిర్ణయించింది. రాష్ట్ర పార్టీ నేతలంగా ఇదే ఐక్యతతో మరో మూడేళ్లలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా పార్టీని అధికారంలోకి తేవచ్చన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆరేళ్లలో హైదరా బాద్ అభి వృద్ధి విషయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలు, వాటి అమలులో వైఫల్యాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో టీఆర్‌ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తమకు కలసి వచ్చేలా బీజేపీ చేసుకోగలిగింది. బ్యాలెట్ ఓట్లు 83 డివిజన్లలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రావడమే ఇందుకు నిదర్శనం. వరద సాయం పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే సోషల్ విూడియాలో కూడా బీజేపీ వ్యతిరేకప్రచారాన్ని బలంగా తిప్పికొట్టగలిగింది. టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చాటింది.