ఎస్టీ వర్గీకరణ జరగాలి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఎన్నొ ఉపకులాలుగా ఉన్న షెడ్యూలు జాతులు కొండకోనల్లో అటవీ ప్రాంతాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, ప్రధానంగా ఆదివాసీలు విద్య, వైద్యం లేక, ప్రభుత్వ ప్రయోజ నాల్ని, రిజర్వేషన్లును పొందలేక పోతున్నారని అందుకే ఎస్టీలను కులాల వారీ వర్గీకరణ జరగాలని ఆదివాసీ హక్కులు పోరాట సమితీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ‘ప్రపంచ ఆదీవాసీ దినొత్సవం సందర్భంగా నగరంలో పెద్దఎత్తున జరుపుకున్నారు. కోర్టు చౌరస్తా నుండి కలెక్టరేట్‌ వరకు వారి సాంప్రదాయ వాయిద్యాలల్లో, వేషధారణలో తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన గుర్రాల రవీందర్‌ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచినా ఆదివాసీలు విద్య ,విజ్ఞానానికి, ఆర్థిక రాజకీయ అభివృద్ధికి నోచుకొలేదని ఆవేదన చెందారు. జిల్లాలో వారు సేద్యం చేస్తున్న పోడు వ్యవసాయ భూములకు పట్టాలివ్వాలని, ఆదివాసీ ప్రజలపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్‌ బొత్త వెంకట మల్లయ్య మాట్లాడుతూ రాజ్యంగా పరంగా ఆదివాసీలకు అందవలిసిన హక్కులు అందడం లేదని, కావున హక్కులకై వారు ఉద్యమించాలని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ ప్రోఫెసర్‌ సూరేపల్లి సుజాత ప్రసంగిస్తు సంస్కృతి, అస్తిత్వం, స్వయం పారిపాలన ప్రశ్నార్థకంగా మారిందని, ఈ ఆదివాసి ప్రపంచదినోత్సవం సందర్భంగా వాటిని కాపాడుకోవ టానికి కృషి చేయాలన్నారు. మరో ప్రత్యేక అతిథి డిటిడబ్ల్యు జిల్లా గిరిజిన సంక్షేమ అధికారి మంకిడి ఎర్రయ్య ప్రసంగిస్తూ గిరిజనులు, ఆదివాసులు విద్యాపరంగా ప్రాధాన్యతనిచ్చి ఉన్నతంగా చదువుకోవాలన్నారు.ఈ బహిరంగ సభలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుద్దబోయిన లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ గిరిజన సమస్యలపై ముఖ్యంగా ఆదివాసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి చక్రం భీంరావు, మన్నేవర్‌ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిడి శంకరయ్య, ఏపీసీసీఎల్‌ జిల్లా అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, బీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము రమేశ్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలు సంఘాల నాయకులు సుదర్శన్‌, కె మహేందర్‌రెడ్డి, తుడుందెబ్బ నాయకులు వెంకటేశ్‌, గడ్డం లక్ష్మి, కొర్రి శ్రీనివాస్‌, మారుతి, లచ్చన్న, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.