టన్నెల్‌లో గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకుంటాం
` ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
నాగర్‌కర్నూల్(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆయన చర్చించారు.సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని చెప్పారు. ’’14 కిలోవిూటర్ల సొరంగ మార్గం ఉంది. చివరి 50 విూటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకూ ప్రమాదం ఉంది. అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకేచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించారు. ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. ఈమేరకు అవసరమైన సామగ్రితో శుక్రవారం 110 మంది కార్మికులు టన్నెల్‌లోనికి వెళ్లారు. అదే సమయంలో సొరంగం పైభాగంలోని భూగర్భ పరిస్థితులను తెలుసుకునేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. కేరళ నుంచి వచ్చిన రెండు ప్రత్యేక జాగిలాలు టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు జాగిలాలు గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు చరవాణిలో విపత్తు నిర్వహణ శాఖ అధికారి అర్వింద్‌కుమార్‌తో మాట్లాడారు. లోపల ఉన్న పరిస్థితులను వివరించారు. సంక్షిప్త సందేశాలు పంపి టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. బీఆర్‌వో సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షిత్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.