ఐక్యంగా పోరాడుదాం

అణువిద్యుత్తు కేంద్ర వ్యతిరేక పోరాట కమిటీ
శ్రీకాకుళం, జూలై 18 : అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీలతో సంబంధం లేకుండా కలసికట్టుగా పోరాడుదామని నాయకులు గొర్లె కిరణ్‌, డిజిఎం ఆనందరావు, కలిశెట్టి అప్పలనాయుడులు పేర్కొన్నారు. రణస్థలం మండలం కొవ్వాడ గ్రామస్తులు ఐక్యంగా ఉద్యమానికి మద్దతు తెలపాలన్నారు. ఇంతవరకు జరిగిన విషయాలు పక్కనపెట్టి ఇక నుంచి కలసికట్టుగా పోరాటం చేస్తేనే ఉద్యమం కార్యరూపం దాలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కొవ్వాడ పంచాయతీ నయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇకపై పంచాయతీలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి మైలపల్లి పోలీసు, అరసవల్లి రాముడు, మైలపల్లి జగ్గులు, చీకటి నర్శిహులతో కమిటీ వేశారు. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు గ్రామస్తులంతా మద్దతు పలికి ఉద్యమం నడిపించాలని సమావేశంలో నిర్ణయించారు. కమిటీ సభ్యులందరూ కలిసే పత్రికా ప్రకటనను విడుదల చేయడంతో పాటు ఉద్యమం చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటారన్నారు. మండల స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి కార్యచరణ రూపొందించడానికి కొంతమంది గైర్హాజరవడంతో వారం రోజుల తరువాత మళ్లీ సమావేశం కావాలని మాజీ ఎం.పి.టి.సి. సభ్యుడు అల్లిపల్లి రాముడు కోరడంతో అందరూ అంగీకరించారు. ఈ సమావేశంలో తాండ్ర ప్రకాష్‌, కూనరామం, తోటయ్య, పైడయ్యరెడ్డి, కరిమజ్జి భాస్కరరావు, తదితరులు పాల్నొగ్నారు.