రణరంగమైన ఓయూ


విద్యార్థి కవాతును అడ్డుకున్న పోలీసులు
పోలీసులపై విద్యార్థుల రాళ్ల దాడి – లాఠీచార్జీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల రాళ్లదాడి, పోలీసుల భాష్పవాయు గోళాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జలదృశ్యం వరకు ఓయూ స్టూడెంట్స్‌ జేఏసీ తలపెట్టిన విద్యార్థి కవాతును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని విద్యార్థులు నచ్చజెప్పినా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని, క్యాంపస్‌ దాటి వెళ్లకూడదని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట జరిగింది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్లదాడులు, భాష్పవాయు గోళాల మోతతో ఓయూ దద్దరిల్లింది.ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా ఓయూ విద్యార్థి జేఏసీ గురువారం విద్యార్థి కవాతు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు నిర్వహించిన జలదృశ్యం వరకూ ర్యాలీ నిర్వహించాలని భావించింది. ఈ మేరకు కవాతు గురువారం ఉదయం 11 గంటలకు ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా ఎన్‌సీసీ గేటువైపు తరలివచ్చారు. మరోవైపు, విద్యార్థుల కవాతు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ర్యాలీగా తరలివస్తున్న విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద నిలువరించారు. గేట్‌కు తాళం వేసి విద్యార్థులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని, జలదృశ్యం వరకూ వెళ్లి బాపూజీకి నివాళులు అర్పించి వస్తామని విద్యార్థి నేతలు వివరించారు. తాము శాంతియుతంగానే వెళ్తామని, తమను వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు మాత్రం అంగీకరించలేదు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసరగా. పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఝళిపించారు. ఇరువైపులా నుంచి రాళ్లు రువ్వుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇరువురు రాళ్లదాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. భాష్పవాయు గోళాలు తగిలి విద్యార్థులు గాయపడగా, రాళ్ల దాడిలో పోలీసులకు, విూడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగింది. విద్యార్థులు ముందుకు రావడం, పోలీసులు వారిని వెనక్కు పంపేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగంచారు.