కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల
మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌
బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు తోంది. రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మరో 51మంది ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతునిస్తున్నారని ఆ వర్గం నేత జగదీష్‌ ఆదివారంనాడు ప్రకటించారు. అంతేగాక ఈ నెల 5వ తేదీలోగా నాయకత్వ మార్పుపై స్పందించాలని డిమాండు చేశారు. లేకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో సిఎం సదానంద శిబిరంలో అలజడి రేకెత్తినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిఎంను మార్చాలంటూ తొమ్మిది మంది మంత్రులు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కర్నాటక అసెంబ్లీలో బిజెపికి 120మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం విదితమే. రోజు రోజుకు రాజకీయ సంక్షోభం ముదురుతుండడంతో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొందని రాజకీయ విశ్లేష కులు చెబుతున్నారు. కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నివారణపై ఇప్పటికే అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పరిస్థితి మరింత జఠిలం కాకముందే ఏదొకటి చేసేందుకు అధిష్టానం సమాయత్తమవుతున్నట్టు వినికిడి.