పీఎస్‌ఎల్‌వీ`సీ62కి కౌంట్‌డౌన్‌ షురూ..

` నేడు నింగిలోకి తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహం
తిరుపతి(జనంసాక్షి): శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నేడు ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ`62 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్‌ ప్రయోగానికి 24 గంటల ముందు ఆదివారం ఉదయం 10.17కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌, శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. రాకెట్‌, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తిరుమలలో విూడియాతో మాట్లాడారు. ‘పీఎస్‌ఎల్‌వీ సీ`62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌`ఎన్‌1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నాం. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్‌ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాం. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది’ అని వివరించారు.