ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు

` అమెరికా శక్తిముందు మేం నిలవలేకపోయాం
` మేం వందల సంఖ్యలో ఉన్నా ఏమీ చేయలేకపోయాం
` వారు కేవలం పదుల సంఖ్యలో వచ్చి మా అధ్యక్షుడికి తీసుకెళ్లిపోయారు
` వారు అత్యాధునిక ఆయుధం ప్రయోగించారు
` దాంతో మేం నిస్సత్తువగా ఉండిపోయాం
` సంచలన విషయాలు వెల్లడిరచిన మదురో బాడీ గార్డ్
కరాకస్(జనంసాక్షి):వెనెజువెలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధంలోకి తీసుకోవడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిరదట. అతి తక్కువ సమయంలోనే రక్షణ సిబ్బంది పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీసిందని మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ చెప్పిన వివరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.‘‘మేం నికోలస్‌కు రక్షణగా విధుల్లో ఉన్నాం. అకస్మాత్తుగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్ల దండు దూసుకొచ్చింది. మా దగ్గరకు వచ్చేసింది. వాటిపై ఎలా స్పందించాలో అర్థం కాలేదు. తర్వాత 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా.. వెంటనే మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారు సాంకేతికంగా ఎంతో ముందున్నారు. ఇంతకుముందు చూడని పోరాట పద్ధతులను ఉపయోగించారు. అమెరికా శక్తి ముందు వెనెజువెలా సైన్యం తేలిపోయింది. మేం వందల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేకపోయింది. ఒకదశలో వారు ఏదో ప్రయోగించారు. దానిని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. అది తీవ్రమైన ధ్వని తరంగంలాంటిది. నా తల లోపలినుంచి పేలిపోతున్నట్లు అనిపించింది. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం. అగ్రరాజ్యంతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది’’ అని ఆ సెక్యూరిటీ గార్డ్ వెల్లడిరచిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. గార్డ్ చెప్పిన మాటలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ షేర్ చేశారు.కాగా.. గార్డ్ చెప్పినదానిని బట్టి అమెరికా లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మైక్రోవేవ్స్, లేజర్స్ వంటి వాటిని వాడి ఉండొచ్చని అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి ఒకరు వెల్లడిరచారు. అలాంటి వర్షన్లు యూఎస్ సైన్యంలో దశాబ్దాల క్రితంనుంచే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటివల్ల రక్తస్రావం, నొప్పి, మంట, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయి. 2020లో గల్వాన్ ఘర్షణలో భారత సైనికులపై చైనా మైక్రోవేవ్ వెపన్ వాడిరదనే ఆరోపణలు వినిపించాయి. అయితే వాటిని ఆ దేశం తోసిపుచ్చింది.

