క్యూబా ఇకపై ఒంటరే…

` ఆ దేశానికి ఇకపై వెనిజులా నుంచి చమురు, డబ్బు ఆగిపోతాయి
` పరిస్థితి చేయి దాటిపోకముందే ఒక ఒప్పందానికి రావాలి
` ట్రంప్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌(జనంసాక్షి):క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సంవత్సరాలుగా ఆ దేశం డబ్బు, చమురు కోసం వెనెజువెలా పై ఆధారపడిరదని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశానికి ఎలాంటి చమురు గానీ, డబ్బు గానీ వెళ్లవని.. పరిస్థితి చేయి దాటిపోకముందే ఒక ఒప్పందానికి రావాలన్నారు. ఈమేరకు ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. మరోవైపు.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో.. క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌పైనా స్పందించారు. ఇది వినడానికి బాగుందన్నారు.‘‘వెనెజువెలా నుంచి పెద్దమొత్తంలో అందిన చమురు, డబ్బుపై ఆధారపడి క్యూబా అనేక సంవత్సరాలు గడిపింది. దానికి ప్రతిఫలంగా.. ఇద్దరు వెనెజువెలా నియంతలకు భద్రతా సేవలు అందించింది. కానీ.. ఇకపై అలా జరగదు. ఇటీవల మేం నిర్వహించిన దాడిలో అనేక మంది క్యూబన్‌ భద్రతాధికారులు చనిపోయారు. వెనెజువెలాకు ఇకపై గూండాలు, దోపిడీదారుల రక్షణ అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉంది. క్యూబాకు చమురు, డబ్బులు కూడా అందవు. పరిస్థితి చేయి దాటిపోకముందే ఆ దేశం ఒక ఒప్పందానికి రావాలి’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ సమయంలో క్యూబాకు చెందిన 32 మంది భద్రతాధికారులు మృతి చెందారు. ఈ దాడిని క్యూబా అధ్యక్షుడు మిగెల్‌ డియజ్‌` కెనల్‌ ఖండిరచారు. హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట వేలాది మంది పాల్గొన్న ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. క్యూబా చమురు అవసరాల్లో దాదాపు 30 శాతం వెనెజువెలా సరఫరా చేస్తుంది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న క్యూబా విద్యుత్‌ వ్యవస్థ, ఇంధన సరఫరాలకు తాజా పరిణామం పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.