కాంగ్రెస్‌ను గట్టెంకించే యత్నాల్లో బిజీ


కసరత్తు ప్రారంభించిన సోనియా గాంధీ
ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం పనికివచ్చేనా?
ప్రియాంకను ముందువరసలో నిలపాలని కొందరి వాదన
న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాంగ్రెస్‌ను బలోపేతం చేసే కృషిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు జోరుగా ఉపందుకుంది. మే 2 నాటి బెంగాల్‌ గెలుపు తరువాత ఆయన జులై 13న రాహుల్‌, ప్రియాంకలతో సమావేశమయ్యారు. సోనియా
గాంధీ కూడా వర్చువల్‌గా వీరి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పాలక కుటుంబం ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నా, ఆయన అలాంటిదేవిూ లేదంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ను గద్దెనెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే సోనియా కూడా మళ్లీ నడుం బిగించారు. విపక్ష పార్టీలను చేరదీసి చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేయాలన్న ఆశలు కల్పిస్తున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్తబ్దత నుంచి బయటపడి క్రియాశీలమయ్యారు. పార్టీలో పెద్ద మార్పులు తీసుకొచ్చే దిశగా ఆమె ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఇప్పుడప్పుడే పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునే సూచనలు లేనప్పటికీ, వచ్చే ఏడాది ఏడు రాష్టాల్రకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే కృషి మొదలైంది. ప్రియాంక గాంధీ మరింత విస్తృతమైన బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకొంటున్నారు. ఆమెను కేవలం యూపికే పరిమితం చేయకుండా దేశానికి మొత్తంగా పంపాలని అంటున్నారు. ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే రాహుల్‌కన్నా బలంగా ముందుకు పోగలదని నమ్మేవారూ ఉన్నారు. 2022లో ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా, గుజరాత్‌ల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రాష్టాల్ల్రో కొన్నింటిలో ఒంటరిగా, మిగతా రాష్టాల్ల్రో ప్రతిపక్షాలతో కలసి భారతీయ జనతా పార్టీని ఓడిరచే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందుకు ప్రశాంత్‌ కిషార్‌ కూడా తన వ్యవూహంతో సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలోపాత, కొత్తతరం నాయకుల సంగమంతో విజయం సాధించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వంటి యువ నాయకులకు కీలక పదవులు ఇవ్వడం, పాత నేతలైన గులాం నబీ ఆజాద్‌ (జమ్మూ`కశ్మీర్‌), రమేశ్‌ చెన్నితల (కేరళ) వంటివారి అనుభవాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ఇందులో భాగంగా కనిపిస్తోంది. త్వరలో కనీసం ముగ్గురు కొత్త ప్రధాన కార్యదర్శు లను నియమించే అవకాశం ఉంది. ఈ నియామకాలు యువ నేతలు, అనుభవజ్ఞుల కలయికగా ఉంటాయని ఓ సీనియర్‌ నాయకుడు చెప్పారు. ఇదిలావుంటే పదవుల్లో తమకు ప్రాధాన్యం లభించడం లేదని ఉత్తర, పశ్చిమ భారత
నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో పార్టీ విప్‌గా కర్ణాటకకు చెందిన నసీర్‌ హుస్సేన్‌ను నియమించడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే అదే రాష్టాన్రికి చెందిన మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో పార్టీ నేతగా, జైరాం రమేష్‌ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ అదే రాష్ట్రం వ్యక్తికి పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ విషయానికి వస్తే పార్టీ నేతగా అధీర్‌ రంజన్‌ చౌధరి (పశ్చిమ బెంగాల్‌), ఉపనేతగా గౌరవ్‌ గొగొయి (అస్సాం), చీఫ్‌ విప్‌గా కె.సురేష్‌ (కేరళ), విప్‌గా మాణికం ఠాగోర్‌ (తమిళనాడు) ఉన్నారు. కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కె.సి.వేణుగోపాల్‌, ప్రధాన సలహాదారుగా పి.చిదంబరం (తమిళనాడు) వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఇలావుండగానే ఇటీవల కొందరు పార్టీనుంచి తప్పుకుంటున్నారు. మరికొందరు సీనియర్లు కస్సుబుస్సుమంటున్నారు. ఈ దశలో కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలపడి ముందుకు సాగించడంలో సోనియా ఏ మేరకు పనిచేయగలరో చూడాలి.