కాంగ్రెస్‌ పార్టీలో కేవీపీయే అసలు కోవర్టు

మధుయాష్కీ ధ్వజం
హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): రాజ్యసభ ఎంపి కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టు అని నిజామాబాద్‌ ఎంపి మధుయాష్కి తీవ్రంగా ఆరోపించారు. కెవిపి రామచంద్రరావు త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కేవలం ఒకే ఒక అపార్టు మెంటు ఉన్న కెవిపి రామచంద్రరావు 5వేల కోట్లకు ఎలా ఎదిగారని మధు యాష్కి ప్రశ్నిం చారు. వైఎస్‌ఆర్‌ అవినీతి, కుంభకోణాల్లో ప్రధాన నిందితుడు కెవిపి రామచంద్రరావు వియ్యంకుడు అని మధుయాష్కీ అన్నారు. వైఎస్‌ఆర్‌ పాల్పడిన అవినీతి అక్రమాల్లో కెవిపి రామచంద్రరావు హస్తం కూడా ఉందని మధుయాష్కి
ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మార్‌, సిబిఐ జెడి లక్ష్మీనారాయణ కాల్‌ లిస్టుల వ్యవహారంలో కెవిపి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సిబిఐ కేసులకు భయపడే వైఎస్‌ఆర్‌ ఫొటో అంశాన్ని కెవిపి లేవనెత్తారని మధుయాష్కి విమర్శించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, అంజయ్య ఫొటోల అంశాన్ని కెవిపి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ చలవతో ఎంపి పదవిని పొందిన కెవిపి ఆ నేతలను విజయమ్మ విమర్శిస్తుంటే కెవిపి ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా సోనియాకు వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను కెవిపి ఎందుకు ఖండించలేదని మధుయాష్కీ ప్రశ్నించారు. సిబిఐ అరెస్టు చేస్తుందన్న భయంతో వైఎస్‌ ఫొటో అంశాన్ని వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు కెవిపి కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కోవర్టుల పనిని అధిష్టానం పడుతుందని ఆయన ప్రస్తుతించారు. వైఎస్‌ఆర్‌ మరణించినప్పుడు ప్రభుత్వానికి ప్రధాన సలహాదారునిగా ఉన్న కెవిపి.. ఆత్మగా చెప్పుకున్న కెవిపి.. సమోసాలు తినుకుంటూ మిన్నకున్నాడే తప్ప ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని మధుయాష్కి మండిపడ్డారు. కెవిపి నీతి, నిజాయితీ లేని వ్యక్తి అని, కుట్ర పూరితంగానే కాంగ్రెస్‌ పార్టీని అప్రదిష్టపాల్జేసేందుకు కెవిపి ప్రయత్నిస్తున్నాడని మధుయాష్కి విమర్శించారు.